ఇంజనీరింగ్, వృత్తి విద్య కొత్త షెడ్యూల్

New schedule of engineering and vocational education - Sakshi

అనుమతులు, తరగతుల నిర్వహణపై సవరించిన షెడ్యూల్‌ విడుదల చేసిన ఏఐసీటీఈ

తొలి విడత కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఆగస్టు 15లోగా 

రెండో విడత ఆగస్టు 25 వరకు

జూలై 18 – 23 వరకు జేఈఈ మెయిన్‌.. ఆగస్టులో అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు  

జేఈఈ మెయిన్‌ పరీక్షలను జూలై 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అడ్వాన్స్‌డ్‌ పరీక్షలను ఆగస్టులో నిర్వహిస్తామని వెల్లడించింది. అలాగే ఇంజనీరింగ్, వృత్తి విద్య కోర్సులకు అనుమతులు, తరగతుల నిర్వహణకు సంబంధించి 2020–21 షెడ్యూల్‌ను సవరిస్తూ ఏఐసీటీఈ ఉత్తర్వులు జారీచేసింది. 

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంజనీరింగ్, వృత్తి విద్య కోర్సులకు అనుమతులు, తరగతుల నిర్వహణకు సంబంధించి 2020–21 షెడ్యూల్‌ను సవరిస్తూ అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఉత్తర్వులు జారీచేసింది. తొలుత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు కొత్త విద్యాసంస్థలకు  ఫిబ్రవరి 28 వరకు, పాత విద్యాసంస్థలు అనుమతుల పునరుద్ధరణ కోసం మార్చి 5 వరకు గడువు ఇచ్చారు. ఈమేరకు కాలేజీల పత్రాల పరిశీలన, అనుమతుల మంజూరు, తరగతుల నిర్వహణకు హేండ్‌బుక్‌ కూడా విడుదలైంది. అయితే కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో యూజీసీ నియమించిన నిపుణుల కమిటీలు ప్రస్తుత విద్యాసంవత్సరంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి సంబంధించి ఇటీవలే సిఫార్సులు అందించాయి. ఈ నేపథ్యంలో దీనికి అనుగుణంగా షెడ్యూల్‌ను సవరిస్తూ ఏఐసీటీఈ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ఢిల్లీలో విడుదల చేశారు. ఏప్రిల్‌లో జరగాల్సిన ఈ పరీక్షలను కరోనా నేపథ్యంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

ఆన్‌లైన్‌లోనే అంతా..
► ఆన్‌లైన్‌ ద్వారా కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతులు ఇవ్వనుంది.
► ఆయా కాలేజీల యాజమాన్యాలు డాక్యుమెంట్ల అప్‌లోడ్, పరిశీలనకు ఆన్‌లైన్‌ వేదికలను వినియోగించుకోవాలి.
► మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి.
► స్క్రూటినీ కమిటీ ఆన్‌లైన్‌ ద్వారానే పరిశీలన పూర్తిచేస్తుందని ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్‌ రాజీవ్‌ కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జూలై 18 నుంచి జేఈఈ మెయిన్‌..
జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలను జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఆగస్టులో నిర్వహిస్తామని, తేదీ తర్వాత ప్రకటిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. 

కొత్త షెడ్యూల్‌ ఇలా...
► అనుమతుల మంజూరు: జూన్‌ 15
► వర్సిటీల గుర్తింపు అనుమతులు: జూన్‌ 30
► తొలి విడత కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు: ఆగస్టు 15 వరకు
► రెండో విడత కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు: ఆగస్టు 25 వరకు
► ఖాళీ సీట్లకు ప్రవేశాలు: ఆగస్టు 31 వరకు
► పీజీడీఎం, పీజీసీఎం మినహా ఇతర అన్ని సాంకేతిక తరగతుల ప్రారంభం: ఆగస్టు 1
► కొత్తగా ప్రవేశం పొందే మొదటి సంవత్సరం విద్యార్థులకు, సెకండ్‌ ఇయర్‌ లేటరల్‌ ఎంట్రీ పొందే వారికి తరగతులు: సెప్టెంబర్‌ 1
► ప్రస్తుతం పీజీడీఎం, పీజీసీఎం విద్యార్థులకు తరగతులు: జూలై 1
► ఫుల్‌ రిఫండ్‌తో పీజీడీఎం, పీజీసీఎం సీట్ల కేన్సిలేషన్‌కు చివరి తేదీ: జూలై 25
► కొత్త అడ్మిషన్లకు చివరి తేదీ: జూలై 31 
► పీజీడీఎం, పీజీసీఎం కొత్త విద్యార్ధులకు తరగతులు: ఆగస్టు 2020 ఆగస్టు 1 నుంచి 2021 జూలై 31వరకు
► దూరవిద్య కోర్సుల విద్యార్థులకు ప్రవేశాలు: 2020 ఆగస్టు 15నుంచి 2021 ఫిబ్రవరి 15 వరకు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top