హద్దులు దాటిన హత్యా రాజకీయాలు 

Murder Politics In Srikakulam District - Sakshi

చర్చనీయాంశమైన ‘ఫరీదుపేట’ ఘటన 

టీడీపీ నేతల అక్రమాలపై పోరాడుతున్న వైఎస్సార్‌ సీపీ నేత మొదలవలస చిరంజీవి 

తట్టుకోలేక దాడులకు యత్నిస్తున్న ప్రత్యర్థులు  

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది మొదలవలస చిరంజీవిపై హత్య కుట్ర శుక్రవారం వెలుగుచూడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో క్రియాశీలంగా ఉంటూ టీడీపీ నేతల అక్రమాలపై పోరాటం చేస్తున్న నాయకుడిని ప్రత్యర్థులు మట్టుబెట్టాలని పథకం రచించడం, దానిని పోలీసులు సకాలంలో ఛేదించడంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

అక్రమ మైనింగ్‌ వెలుగులోకి.. 
మొదలవలస చిరంజీవి వైఎస్సార్‌ సీపీలో చేరిన కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు పొందారు. 2018 ఆగస్టు 29న రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి విశేష కృషి చేశారు. టీడీపీ బలంగా ఉన్న గ్రామాల్లో వైఎస్సార్‌ సీపీ క్యాడర్‌ తయారు చేసి వారిలో ఆత్మస్థైర్యం నింపారు. పార్టీలో క్రియాశీలంగా ఉంటూనే మరోవైపు టీడీపీ నేతల అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చారు. పొరుగునే ఉన్న ఎస్‌ఎంపురం గ్రామానికి చెందిన  జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు ఇదే గ్రామంలోని పెద్దచెరువులో చేసిన అక్రమ మైనింగ్‌ (కంకర అమ్మకం), చిలకపాలెంలో టీడీపీ నాయకుడు గాడు సన్యాసి అక్రమ మైనింగ్‌పై గనుల శాఖకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకునేలా పోరాడారు.

టీడీపీ పాలనలో కార్పొరేషన్‌ రుణాలు, రోడ్డు నిర్మాణాలు వంటి అక్రమాలపై సమాచార హక్కు చట్టం ద్వారా పోరాటం చేశారు. మరోవైపు చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ సామాజిక ప్రయోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ పాలనలో చిరంజీవిపై వ్యక్తిగత కక్షలు కొనసాగాయి. రౌడీ షీట్‌ ప్రారంభం, పీడీ యాక్టు ప్రయోగం చేశారు. అయితే స్వతహాగా న్యాయవాది అయిన చిరంజీవి చట్టపరంగా వాటిని ఎదుర్కొన్నారు. పీడీ యాక్టు కమిటీ ముందు యాక్టు ప్రయోగ నిబంధనలు, వ్యక్తిగత కక్ష కోణాన్ని పక్కాగా ఆవిష్కరించటంతో సమీక్ష కమిటీ నెల రోజుల్లో  విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.

హత్యకు వ్యూహరచన.. 
ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు టీడీపీ నేతలు కొన్నినెలలుగా ఫరీదుపేట బయట ఉంటూనే చిరంజీవి హత్యకు వ్యూహరచన చేశారు. దీనిని గుర్తించిన చిరంజీవి తనకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ నాయకులు, మాజీ ఎంపీటీసీ కొత్తకోట అమ్మినాయుడు, సువ్వారి తేజేశ్వరరావు, పక్క గ్రామమైన ఇబ్రహీంబాద్‌కు చెందిన కిల్లి ప్రకాష్‌ తదితరులపై ఎచ్చెర్ల పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉన్న చిరంజీవిని చివరకు ఇంటి వద్దే హత్యచేసేందుకు ప్రత్యర్థులు వ్యూహరచన సిద్ధం చేశారు. ఈ ప్రణాళికంతా విశాఖపట్నం కేంద్రంగా జరగటం, కాశీబుగ్గకు చెంది  రౌడీషీటర్‌ సహకారం తీసుకోవటం, హత్యా నేరంలో పాల్గొనేందుకు రెక్కీ నిర్వహించడంతో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కొందరు పోలీస్‌స్టేషన్లకు వచ్చి సకాలంలో సంతకాలు చేయకపోవటం, తరచూ శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం రాకపోకలు సాగించడం వంటి అంశాలు గుర్తించారు. ప్రత్యేకంగా నిఘా పెట్టడంతో హత్యాప్రయత్నం కోణం బయటకు వచ్చింది. ప్రస్తుతం జరిగిన దాడి కుట్రకు సంబంధించి ఫరీదుపేటకు చెందిన కొందరు టీడీపీ నాయకులు ఇంకా పరారీలోనే ఉన్నారు. వారు పట్టుబడితే పోలీసుల విచారణలో పూర్తి వాస్తవాలు బయటపడే అవకాశముంది. 

పలాసలో కలకలం 
కాశీబుగ్గ: వైఎస్సార్‌ సీపీ నేత మొదలవలస చిరంజీవిపై హత్యకు కుట్ర పన్నిన వారిలో పలాసకు చెందిన రౌడీషీటర్‌ బోనెల పరమేష్‌ను విశాఖ పోలీసులు అరెస్టు చేయడంతో పలాసలో కలకలం రేగింది. నేరచరిత్ర కలిగిన పరమేష్‌ను పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా వారి బంధువులను, స్నేహితులను విచారించినట్లు తెలిసింది. ఇప్పటికే అంబుసోలి గ్రామంలో ఇంటెలిజెన్సీ ఎస్‌ఐ, సిబ్బంది, స్పెషల్‌ బ్రాంచ్‌ సిబ్బంది పూర్తి సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. పరమేష్‌ గతంలో కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ యువకుడ్ని నాటుతుపాకీతో బెదిరించిన కేసులు కూడా ఉన్నాయి. 
2019 ఎన్నికలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన పరమేష్‌ పలాస పరిసర ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాపట్నం జిల్లాల్లో ఆర్థిక నేరాలకు కూడా పాల్పడినట్లు తెలిసింది. ఇదే విషయమై కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు వద్ద ప్రస్తావించగా పరమేష్పై కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో 2002లో రౌడీషీట్‌ తెరిచి ఉందన్నారు. రెండు హత్యాయత్నం, ఒక చోరీకి, రెండు దాడి కేసులున్నాయని చెప్పారు. పరమేష్‌ తమ్ముడు బోనెల గోపిపై కూడా   రౌడీషీట్‌ తెరచి ఉందని తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top