రాష్ట్ర విభజన వల్ల వచ్చే నష్టాలను గ్రామస్థాయిలో వివరిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని డీఈఓ మువ్వా రామలింగం పిలుపునిచ్చారు.
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన వల్ల వచ్చే నష్టాలను గ్రామస్థాయిలో వివరిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని డీఈఓ మువ్వా రామలింగం పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు నిరసనగా సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని గాంధీబొమ్మ సమీపంలో చేపట్టిన రిలే దీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమంలోకి తీసుకురావాలని కోరారు.
విభజన జరిగితే రాబోయే తరాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందనే విషయాన్ని తెలియజేయాలని సూచించారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయుడు బట్టా శంకరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరానికి శంకరయ్య ప్రాంగణంగా నామకరణం చేశారు. ఎన్ రమణయ్య, ఎస్ నాగేంద్ర, కృష్ణారెడ్డి, సుబ్బారావు, చెంచురామయ్య, జగదీష్ పాల్గొన్నారు.
సమైక్యాంధ్రకే కట్టుబడాలి
సీమాంధ్రలోని అన్ని రాజకీయపార్టీలు సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నాయని స్పష్టంగా ప్రకటించాలని యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి తులసీరాంబాబు పేర్కొన్నారు. నగరంలోని వీఆర్సీ కూడలిలో ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శుక్రవారంతో 18వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో యోగాసనాలు వేస్తూ ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పరంధామయ్య, గోపాల్, చలపతి, ఎమ్సీ అచ్చయ్య, రత్నం, అబ్దుల్‌గయాజ్, జమీర్, భాస్కర్‌రెడ్డి, సనావుల్లా, ఉమాశంకర్, సుధాకర్, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
ముందంజలో నిలవడం
అభినందనీయం
భవిష్యత్తు తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రథమ వరుసలో నిలవడం అభినందనీయమని డీఈఓ మువ్వా రామలింగం పేర్కొన్నారు. నగరంలోని కేఏసీ కళాశాల సమీపంలో జూనియర్ లెక్చరర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహారదీక్ష శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు. సికిందర్, రవీంద్రబాబు పాల్గొన్నారు.
కేంద్రానికి గుణపాఠం చెప్తాం
విభజన నిర్ణయం తీసుకున్న కేంద్రంలోని యూపీఏ సర్కార్‌కు తగిన గుణపాఠం చెప్తామని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకుడు తిరుమలనాయుడు పేర్కొన్నారు. విభజనకు నిరసనగా శుక్రవారం వీఆర్సీ కూడలిలో నిరసన ప్రదర్శన, మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కుక్కకు సోనియా మాస్క్ తగిలించి తమ నిరసనను వ్యక్తం చేశారు. హాజీ, దత్తు, తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం దిగిరావాలి
సీమాంధ్రుల ఉద్యమ ప్రభావంతో కేంద్రం దిగిరాక తప్పదని ఆర్టీసీ జేఏసీ నాయకుడు రమణరాజు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా శుక్రవారం స్థానిక బస్‌స్టేషన్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బస్‌స్టేషన్ ఎదుట జీటీ రోడ్డుపై మానవహారం చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీమాంధ్రలోని ప్రజలు విభజనను వ్యతిరేకిస్తుంటే, కొందరు స్వార్థపరుల ప్రయోజనాల కోసం యూపీఏ సర్కార్ విభజన చేపట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కమిటీలతో కాలయాపన చేయకుండా వెంటనే సమైక్య రాష్ట్ర ప్రకటన చేయాలని, లేని పక్షంలో ఢిల్లీ పెద్దలు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏవీఎస్ కుమార్, ఏవీ గిరిధర్, పెంచలరెడ్డి, సీహెచ్ శ్రీనివాసులు, ఇస్మాయిల్, డీబీ శామ్యూల్, నారాయణరావు, మహబూ, శేఖర్, మాల్యాద్రి, శశికుమార్, డీసీ అబ్బయ్య, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలకు బైక్ ర్యాలీ నేడు
రాష్ట్ర విభజనకు నిరసనగా శనివారం ఉదయం స్థానిక బస్‌స్టేషన్ నుంచి తిరుమలకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కార్మిక్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి మాల్యా ద్రి తెలిపారు. తమ సంఘానికి చెందిన 30 మంది మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని వెంకటేశ్వరుడ్ని ప్రార్థిస్తామన్నారు.
అలుపెరగని పోరాటం
సమైక్య రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం కొనసాగిస్తామని వీఎస్‌యూ జేఏసీ కార్యదర్శి సుజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా శుక్రవారం వీఆర్సీ కూడలిలో మానవహారం నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకొని అధ్యాపకులు, విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుజయ్‌కుమార్ మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాలు స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నాయని చెప్పారు. శ్రీనివాసులురెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, వీరారెడ్డి, పీసీరెడ్డి, హనుమారెడ్డి, హుస్సేనయ్య, శ్రీలత, విజేత, విజయ, దీప్తి, జలజకుమారి, మౌళి, తదితరులు పాల్గొన్నారు.
రాస్తారోకో
నెల్లూరు(బారకాసు): సమైక్యాంధ్రకు మద్దతుగా నగరపాలక సంస్థ ఉద్యోగులు శుక్రవారం పొదలకూరు రోడ్డులోని సంస్థ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఉద్యోగులు కోలాటమాడుతూ నిరసన వ్యక్తం చేశారు. చక్రపాణి, కృష్ణకిషోర్, శ్రీను, మునిరత్నం, పద్మ, చినబాబు, మోజెస్ పాల్గొన్నారు.
టైలర్స్ భారీ ర్యాలీ
నెల్లూరు(హరనాథపురం): సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం టైలర్ షాపులను మూసేసి నగరంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపైనే ఆటాపాటా నిర్వహించి నిరసన తెలియజేశారు. స్థానిక వీఆర్సీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పైడా వెంకటేశ్వర్లు, టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మస్తాన్‌వలీ, ట్రెజరర్ షుకూర్, మస్తాన్, శ్రీనివాసులు, సురేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.