పశ్చిమగోదావరి జిల్లాకు హుదూద్ పెనుతుపాను గండం తప్పింది. అయితే తుపాను తీరం దాటిన అనంతరం అల్పపీడనంగా మారటంతో జిల్లాకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయి.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాకు హుదూద్ పెనుతుపాను గండం తప్పింది. అయితే తుపాను తీరం దాటిన అనంతరం అల్పపీడనంగా మారటంతో జిల్లాకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. తుపాను తీరం దాటే సమయంలో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం వరకు 5 గంటల వరకు నరసాపురం మండలం చినమైనవానిలంక, పెదమైనవానిలంక సముద్రతీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడ్డాయి.
ముందుజాగ్రత్తగా మొగల్తూరు, నరసాపురం మండలాల్లో తీర గ్రామాల నుంచి 8,179 మందిని 23 పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్పపీడనం కొనసాగుతుండటంతో పునరావాస కేంద్రాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, పీతల సుజాత, కలెక్టర్ కె.భాస్కర్ ఆదివారం తీర గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. కాగా, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.