ఆ తల్లి కడుపుకోత పాపం ఎవరిది? | medical department Failure in Sitampeta | Sakshi
Sakshi News home page

ఆ తల్లి కడుపుకోత పాపం ఎవరిది?

Jun 6 2015 12:37 AM | Updated on Oct 9 2018 7:11 PM

అటు సర్కారు... ఇటు అధికారులు ఏ సమావేశం ఏర్పాటు చేసినా మాతా శిశు మరణాలు తగ్గాలని ఉద్బోధిస్తున్నారు. అది కంఠశోషగానే మిగిలిపోతోంది.

 వైద్యశాఖ వైఫల్యమా- పోషకాహార లోపమా?
 ఏడాదిలో 190 మంది శిశువులు, 14 మంది బాలింతలు మృతి
 20 సబ్‌ప్లాన్ మండలాల్లోని గిరిజనేతరుల్లోనే మరణాలు అధికం
 పెరుగుతున్న  మాతాశిశుమరణాలు
 
 సీతంపేట:అటు సర్కారు... ఇటు అధికారులు ఏ సమావేశం ఏర్పాటు చేసినా మాతా శిశు మరణాలు తగ్గాలని ఉద్బోధిస్తున్నారు. అది కంఠశోషగానే మిగిలిపోతోంది. తల్లులకు కడుపుకోత తప్పడంలేదు. మార్పు కార్యక్రమం ద్వారా ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడంలేదు. జిల్లాలో 20 సబ్‌ప్లాన్ గిరిజన మండలాల్లో మాతా శిశుమరణాలు ఎక్కువగా ఉన్నాయి. విశేషమేమిటంటే గిరిజనేతరుల్లోనే ఎక్కువగా మరణాలు సంభవించడం గమనార్హం. ఏప్రిల్ 2014 నుంచి మార్చి 2015 వరకు అధికారిక గణాంకాల ప్రకారం 190 మంది శిశువులు మృతిచెందగా వీరిలో 177 మంది గిరిజనేతరులుండగా 13 మంది గిరిజన శిశువులున్నాయి. అలాగే 14 మంది తల్లులు మరణించగా వీరిలో 12 మంది గిరజనేతరులు, ఇద్దరు గిరిజన తల్లులు ఉన్నారు. అనధికారికంగా మృతుల సంఖ్య ఎక్కువే ఉంటుందనేది నిర్వివాదాంశం. గిరిజన ప్రాంతాల్లో కొండలపై ఉన్న గ్రామాల్లో ఇంటివద్దే ప్రసవాలు జరిగి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. అవి లెక్కలోకి రావడం లేదు.
 
 ఇదీ పరిస్థితి...
 ఐటీడీఏ పరిధిలోని 20 మండలాల్లో 27 పీహెచ్‌సీలు, మరో 10 సీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రాధమిక ఆరోగ్య ఉపకేంద్రాలు 151, ఏరియా ఆస్పత్రులు రెండున్నాయి. వీటి ద్వారా సకాలంలో వైద్యసేవలందాలి. అలాగే ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఉంది.ప్రసవానికి ముందు 15 రోజులు, ప్రసవం తర్వాత మరో పక్షం రోజులు ఆసుపత్రిలోనే ఉంచడానికి వీలుగా బర్త్ వెయిటింగ్ రూంలను సీతంపేట, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి ఆరోగ్య కేంద్రాల్లో నెలకొల్పారు. వీటి పై చైతన్యం లేకపోవడంతో ఇంటి వద్దే ప్రసవాలు జరిగి మరణించే సందర్బాలు ఎన్నోఉన్నాయి.
 
 పోషకాహారం మాటేమిటి ?...
 ఐసీడీఎస్ పరిధిలో ఏడు గిరిజన ప్రాజెక్టులున్నాయి. వీటిలో 946 అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు సుమారు 8,500ల మంది ఉన్నారు. అంతేకాకుండా వీరఘట్టం, సారవకోట, కొత్తూరు, సీతంపేట, మందస, పాలకొండ, ఇచ్చాపురం రూరల్ పరిధిలో అమృతహస్తం అమలవుతోంది. సీతంపేట, కొత్తూరులో 109 న్యూట్రిషియన్ కేంద్రాలు కూడా నడుస్తున్నాయి. ఇన్ని ఉన్నా సరైన పోషకాహారం అందకే  మాతాశిశుమరణాలు సంభవిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఐటీడీఏ ఉపవైద్యాశాఖాధికారి ఎం.పి.వి.నాయక్ వద్ద సాక్షి ప్రస్తావించగా గిరిజనుల్లో మాతా శిశుమరణాలు తగ్గాయని తెలిపారు. ఐటీడీఏ ద్వారా పాలప్యాకెట్లను కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement