బోధనాసుపత్రులకు ఏసీబీ సెగ

Massive corruption in drug purchases in the name of Local Purchase - Sakshi

పారిశుధ్య కాంట్రాక్టర్ల నుంచి ప్రతినెలా వసూళ్లు

లోకల్‌ పర్చేజ్‌ పేరుతో మందుల కొనుగోళ్లలో భారీగా అవినీతి

బోధనాసుపత్రుల సూపరింటెండెంట్‌లపై ఫిర్యాదుల వెల్లువ

సాక్షి, అమరావతి: రెండ్రోజులుగా ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా మందుల కొనుగోళ్లు చేస్తున్నారన్న ఫిర్యాదులతో ఏసీబీ దాడులతో అవినీతి అధికారులకు చెమటలు పడుతున్నాయి. ఈ సెగ ఇప్పుడు బోధనాసుపత్రులకు తగులుతోంది. బోధనాసుపత్రుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఇప్పటికే ఏసీబీ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు భారీగా ఫిర్యాదులందాయి. దీంతో బోధనాసుపత్రుల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడుతున్న సూపరింటెండెంట్‌లు, ఆర్‌ఎంవోలు, లే సెక్రటరీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో దీనిపై నియంత్రణ లేకపోవడంతో దీనిపై ఇప్పుడు ఏసీబీ అధికారులు కన్నేశారు. అవినీతి వైద్యులు, అధికారుల ఆట కట్టిస్తే పేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని దర్యాప్తు సంస్థలకు లేఖలు అందాయి. ఇలా ఫిర్యాదులతోనే ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి ఏసీబీ అధికారులు పలు లోపాలను గుర్తించారు. ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రుల్లో నెల్లూరు, విజయవాడ నుంచే ఎక్కువ.

బోధనాసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులు ఇవే
- పారిశుధ్య కాంట్రాక్టర్లకు పనితీరు ఆధారంగా మార్కులేయాలి. 95 మార్కులేస్తేనే వారికి 95 శాతం పైగా బిల్లులు వస్తాయి. ఈ మార్కులు వేసేందుకు వారి నుంచి నెలకు ఒక్కో సూపరింటెండెంట్‌ రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. నెల్లూరు బోధనాసుపత్రిలో నెలకు రూ.7 లక్షలు డిమాండ్‌ చేసినట్టు ఫిర్యాదులు అందాయి.
రోగులకు ఆహారం పెట్టే డైట్‌ కాంట్రాక్టర్ల బిల్లులు పాస్‌ కావాలంటే ప్రతి నెలా సూపరింటెండెంట్‌లకు కమీషన్లు ఇవ్వాల్సిందే.
విజయవాడ మెటర్నిటీ ఆస్పత్రిలో ప్రైవేటు వ్యక్తికి హోటల్‌కు అనుమతి ఇచ్చినందుకు భారీగా ముడుపులు.. నిబంధనలకు విరుద్ధంగా ఆ హోటల్‌ యజమాని ప్రహరీగోడ పగులగొట్టి లలితా హోటల్‌ పేరుతో నిర్వహణ.
విజయవాడ బోధనాసుపత్రిలో సార్జెంట్‌గా పనిచేసే కిందిస్థాయి సిబ్బంది ఒకరు సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఎల్‌ఐసీ పాలసీలు కట్టాలని బెదిరింపు. ఆ సార్జెంట్‌ ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ అయితే.. అదేపనిగా డిప్యుటేషన్‌ మీద సూపరింటెండెంట్‌ ఇక్కడకు తెప్పించుకున్నట్టు ఆరోపణలు.
లోకల్‌ పర్చేజ్‌ కింద కొనుగోలు చేసే మందులపై ఆయా సరఫరా దారులతో సూపరింటెండెంట్‌లు, ఆర్‌ఎంవోలు ప్రతినెలా కమీషన్ల రూపేణా వాటాలు.
ఆస్పత్రిలో పారిశుధ్య పనిచేయాల్సిన కార్మికులతో సూపరింటెండెంట్‌లు ఇంట్లో పనిచేయించుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top