పైసలు పెట్టు.. కాపీ కొట్టు

Mass Copying In Hindhi Entrance Exam PSR Nellore - Sakshi

ఇదీ దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షల తీరు

అధికారుల పర్యవేక్షణ శూన్యం   

నెల్లూరు , నాయుడుపేట: దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆదివారం నిర్వహించిన ప్రాథమిక, మాధ్యమ, రాష్ట్ర భాష, విశారద, ప్రవీణ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌ యథేచ్ఛగా సాగింది. పట్టణంలోని ఎల్‌ఏసాగరం ఉన్నత పాఠశాల, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షలు జరగ్గా ఉపాధ్యాయుల సహకారంతో కొందరు విద్యార్థులు పుస్తకాలు పెట్టి రాశారు. ఎల్‌ఏ పాఠశాలలో 220 మంది విద్యార్థులు, బాలికల ఉన్నత పాఠశాలలో 108 మంది పరీక్షలకు హజరయ్యారు. మొత్తం నాలుగు గదుల్లో పరీక్షలు జరిగాయి.

ఇన్విజిలేటర్లు బయట కబుర్లు చెప్పుకుంటుండగా కొందరు విద్యార్థులు చిట్టీలు, పుస్తకాలు పెట్టి పరీక్షలు రాశారు. ఫొటోలు తీయడం గుర్తించి పుస్తకాలను బయటపడవేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. విద్యార్థుల నుంచి డబ్బు తీసుకుని వదిలేసినట్లు విమర్శలున్నాయి. దీనిపై జిల్లా విద్యా శాఖకు చెందిన పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రేమ్‌కిషోర్‌ మాట్లాడుతూ దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షల నిర్వహణ తమ పరిధిలోకి రాదన్నారు. గతంలో తమకు అప్పగించేవారని, ఈ ఏడాది నిర్వహణపై ఎలాంటి సమాచారంలేదని తెలిపారు. నేరుగా కేంద్ర ప్రభుత్వ అధికారులే పర్వవేక్షిస్తున్నట్లు తెలిసిందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top