విజయవాడ చిట్టినగర్‌లో శనివారం ఉదయం ఓ వ్యక్తి తన భార్య, కుమారుడు, అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో చికిత్స పొందుతున్న భార్య రోజా, ఎనిమిది నెలల కుమారుడు సాయంత్రం మరణించారు.
కృష్ణా (విజయవాడ) : విజయవాడ చిట్టినగర్‌లో శనివారం ఉదయం ఓ వ్యక్తి తన భార్య, కుమారుడు, అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో చికిత్స పొందుతున్న భార్య రోజా, ఎనిమిది నెలల కుమారుడు సాయంత్రం మరణించారు. గుంటూరు జిల్లా ఎర్రబాలెంకు చెందిన రాజేంద్రప్రసాద్‌కు మూడేళ్ల కిందట చిట్టినగర్‌కు చెందిన ఆకుల రోజాతో వివాహం జరిగింది. వీరికి ఎనిమిది నెలల బాబు ఉన్నాడు.
అయితే కుటుంబ కలహాల కారణంగా రాజేంద్రప్రసాద్ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం భార్య పుట్టింటికి వెళ్లి వారితో గొడవ పడ్డాడు. భార్య, కుమారుడు, అడ్డు వచ్చిన అత్తపై పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యాడు. దీంతో వారిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య, కుమారుడు చికిత్స పొందుతూ సాయంత్రం 6 గంటలకు మరణించారు.