చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా

Kurnool Police Focus on Sand Smuggling And Alcohol - Sakshi

ఇసుక, మద్యం అక్రమ రవాణా నిరోధంపై ప్రత్యేక దృష్టి

చెక్‌పోస్టుల్లో గార్డులుగా మాజీ సైనికుల నియామకం

కర్నూలు: ఇసుక, మద్యం అక్రమ రవాణాను నిరోధించడానికి పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 10 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాటి వద్ద సీసీ కెమెరాలు కూడా అమర్చుతున్నారు. అక్కడ గార్డులుగా విధులు నిర్వర్తించేందుకు మాజీ సైనికులు (మిలటరీ, పారా మిలటరీ) 60 మందిని ఎంపిక చేశారు. వీరికి నెలసరి వేతనం రూ.15 వేల చొప్పున చెల్లించనున్నారు. 60 గార్డుల పోస్టుల ¿భర్తీకి మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు అహ్వానించగా..మొత్తం 108 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిని మంగళవారం పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియానికి పిలిపించారు. ధ్రువ పత్రాలు పరిశీలించిన తర్వాత లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు.

ఇవీ చెక్‌పోస్టులు..
మాధవరం (మాధవరం పోలీసుస్టేషన్‌ పరిధి), క్షేత్రగుడి (హాలహర్వి పీఎస్‌), బాపురం (కౌతాళం పీఎస్‌), పంచలింగాల, ఈ తాండ్రపాడు, మునగాలపాడు, దేవమడ (కర్నూలు తాలూకా పీఎస్‌), సుంకేసుల (గూడూరు పీఎస్‌), మార్లమడికి (హోళగుంద పీఎస్‌), పెద్దహరివనం (ఇస్వీ పీఎస్‌).

ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయండి
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విధులు నిర్వహించాలని మాజీ సైనిక ఉద్యోగులకు ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. ప్రస్తుతం ఎంపిక కాని 48 మందిని కూడా చిత్తూరు, అనంతపురం జిల్లాలకు పంపించి అక్కడ సేవలందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో వేతనాలు పెరుగుతాయని, వారానికి రెండు రోజుల  ఆఫ్‌లు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ రమణమూర్తి, సీఐ లక్ష్మయ్య, ఎస్‌ఐ మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top