ఏపీకి 84.. తెలంగాణకు 140 | Krishna Board Meeting In Hyderabad | Sakshi
Sakshi News home page

ముగిసిన కృష్ణా బోర్డు భేటీ

Jan 9 2020 4:27 PM | Updated on Jan 9 2020 8:30 PM

Krishna Board Meeting In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో కనీస నీటి మట్టాలకు ఎగువన అందుబాటులో ఉన్న జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 84, తెలంగాణకు 140 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. వరద వచ్చిన రోజుల్లో వినియోగించుకున్న నీటిని లెక్కలోకి తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ చేసిన ప్రతిపాదనపై మరోసారి చర్చిద్దామని సూచించింది. బోర్డు వర్కింగ్‌ మ్యాన్యువల్‌ (కార్యనిర్వాహక నియమావళి)ని కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని కృష్ణా బోర్డు చైర్మన్‌ డాక్టర్‌ ఆర్కే గుప్తా చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.

హైదరాబాద్‌లోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కార్యాలయంలో చైర్మన్‌ డాక్టర్‌ ఆర్కే గుప్తా అధ్యక్షతన బోర్డు గురువారం సమావేశమైంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటిదాకా ఏపీ 511, తెలంగాణ 159 టీఎంసీలు వినియోగించుకున్నాయని బోర్డు సభ్య కార్యదర్శి ఎ. పరమేశం వివరించారు.. దీనిపై ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ స్పందిస్తూ.. ఈ ఏడాది శ్రీశైలానికి కృష్ణా నది నుంచి ఎనిమిది దఫాలుగా భారీగా వరద ప్రవాహం  రావడంవల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది 800 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశామన్నారు. సముద్రంలో కలుస్తున్న వరద జలాలను వినియోగించుకున్నామని.. వాటిని లెక్కలోకి తీసుకోవద్దని బోర్డుకు విఙ్ఞప్తి చేశారు. ఈ అంశంపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోలేమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల 13న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉండే అవకాశం ఉందని.. అప్పుడు వారిరువురూ  నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement