ప్రధాన న్యాయమూర్తులను ప్రశ్నించొద్దా? 

Justice Jasti Chalameshwar Comments About Chief judges - Sakshi

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ 

ప్రధానమంత్రి, సీఎంలను ప్రశ్నిస్తున్నప్పుడు సీజేలను ప్రశ్నించొద్దంటే ఎలా? 

ఓట్లు కొనుక్కోవడం, డబ్బులు సంపాదించడమే పాలిటిక్స్‌ అయ్యాయి: ఉండవల్లి 

పుట్టుకతోనే గొప్పవాడినని బాబు భావించడం వల్లే ఈ పరిస్థితి: ఐవైఆర్‌ 

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వైరాగ్యం, విరక్తి కలుగుతున్నాయి: అజేయ కల్లం

సాక్షి, అమరావతి: ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను సాధారణ పౌరులు సైతం ప్రశ్నిస్తున్నప్పుడు... నన్నెవరూ ప్రశ్నించజాలరు అని ప్రధాన న్యాయమూర్తులు అనుకోవడం తనకు ఇప్పటికీ అర్థం కాని విషయమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. వాళ్లు(ప్రధాన న్యాయమూర్తులు) ఎందుకు అతీతులుగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఐవైఆర్‌ కృష్ణారావు రచించిన ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకాన్ని ఆదివారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ మాట్లాడుతూ... సుప్రీంకోర్టులో కూడా జవాబుదారీతనం కోసమే తాను ఆనాడు కొలీజియం గురించి ప్రశ్నించానన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే నిర్ణయం తీసుకోవడం కంటే ఐదుగురు సభ్యులతో కూడిన కొలీజియం నిర్ణయం తీసుకోవడం కొంచెం నయమని పేర్కొన్నారు. దేశంలో రోజుకొక గాంధీ పుట్టరని, మనకు మనమే బాధ్యతగా మెలిగితేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని పేర్కొన్నారు. కాగా, రాజకీయాలు మరీ దారుణంగా ఉన్నాయని, పేకాట (జూదం) కంటే ఎక్కువ రిస్కుగా మారాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చెప్పారు. ప్రజలకు డబ్బులు పంచి ఓట్లు కొనుక్కోవడం, ఆ పెట్టుబడిని మళ్లీ రాజకీయాల ద్వారా సంపాదించడమే పరిపాలనగా మారిందన్నారు. ఐవైఆర్, అజేయ కల్లం లాంటి వారు ప్రభుత్వంలో జరిగినవి చెప్పడం వల్లే జనానికి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయన్నారు. 

చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు 
తాను పుట్టుకతోనే గొప్పవాడిననే భావన సీఎం చంద్రబాబులో ఉండటం వల్లే రెండో దశలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు. పాలించే నాయకులపై గొప్ప నమ్మకంతో బ్యూరోక్రాట్లు వ్యవహరించి సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడమే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అని చెప్పారు. పాలకులు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కాదన్నారు. ‘‘విభజనకు సంబంధించిన అంశాలు, లోపభూయిష్టమైన విభజన చట్టం, అందులోని సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఇప్పటికీ ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి’’ అనే విషయాలను ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకంలో ప్రస్తావించానని చెప్పారు ముఖ్యమంత్రికి, తనకు మధ్య ఉన్న భేదాభిప్రాయాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని తన తోటి ఐఏఎస్‌ అధికారి చందనాఖన్‌కు, కార్మిక శాఖ అడిషనల్‌ కమిషనర్‌ మురళి సాగర్‌కు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చినట్టు ఐవైఆర్‌ కృష్ణారావు తెలిపారు. 

ప్రైవేటు, పార్టీ ప్రయోజనాలే ఎక్కువయ్యాయి 
ప్రస్తుత పాలనలో ప్రజా ప్రయోజనాల కంటే ప్రైవేటు, పార్టీ ప్రయోజనాలే ఎక్కువయ్యాయని ప్రభుత్వ మాజీ చీఫ్‌ సెక్రటరీ అజేయ కల్లం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తోంటే వైరాగ్యం, విరక్తి కలుగుతున్నాయన్నారు. వ్యవస్థలన్నిటినీ కుప్పకూల్చారని వాపోయారు. నాకేమిటి, నా పార్టీకేమిటి అనే ఉద్దేశంతోనే పని చేస్తున్నారని విమర్శించారు. పౌరుల తీరులో మార్పు రావాలని, ప్రశ్నించే తత్వం చూపాలన్నారు. ప్రజల్లో మార్పు తేవడానికే ఐవైఆర్‌  ఈ పుస్తకాన్ని బయటకు తెచ్చారన్నారు. ఎక్కడకు వెళ్లినా రాజకీయాల్లోకి వస్తున్నారా అని అడుగుతున్నారని, లోపాలను బహిర్గతం చేయడానికి రాజకీయాల్లోకే రావాలా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ, చందనాఖన్, హన్స్‌ ఇండియా సంపాదకులు రాము శర్మ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top