breaking news
ajeya Callum
-
ప్రధాన న్యాయమూర్తులను ప్రశ్నించొద్దా?
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను సాధారణ పౌరులు సైతం ప్రశ్నిస్తున్నప్పుడు... నన్నెవరూ ప్రశ్నించజాలరు అని ప్రధాన న్యాయమూర్తులు అనుకోవడం తనకు ఇప్పటికీ అర్థం కాని విషయమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. వాళ్లు(ప్రధాన న్యాయమూర్తులు) ఎందుకు అతీతులుగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకాన్ని ఆదివారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ... సుప్రీంకోర్టులో కూడా జవాబుదారీతనం కోసమే తాను ఆనాడు కొలీజియం గురించి ప్రశ్నించానన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే నిర్ణయం తీసుకోవడం కంటే ఐదుగురు సభ్యులతో కూడిన కొలీజియం నిర్ణయం తీసుకోవడం కొంచెం నయమని పేర్కొన్నారు. దేశంలో రోజుకొక గాంధీ పుట్టరని, మనకు మనమే బాధ్యతగా మెలిగితేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని పేర్కొన్నారు. కాగా, రాజకీయాలు మరీ దారుణంగా ఉన్నాయని, పేకాట (జూదం) కంటే ఎక్కువ రిస్కుగా మారాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. ప్రజలకు డబ్బులు పంచి ఓట్లు కొనుక్కోవడం, ఆ పెట్టుబడిని మళ్లీ రాజకీయాల ద్వారా సంపాదించడమే పరిపాలనగా మారిందన్నారు. ఐవైఆర్, అజేయ కల్లం లాంటి వారు ప్రభుత్వంలో జరిగినవి చెప్పడం వల్లే జనానికి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయన్నారు. చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు తాను పుట్టుకతోనే గొప్పవాడిననే భావన సీఎం చంద్రబాబులో ఉండటం వల్లే రెండో దశలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. పాలించే నాయకులపై గొప్ప నమ్మకంతో బ్యూరోక్రాట్లు వ్యవహరించి సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పారు. పాలకులు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదన్నారు. ‘‘విభజనకు సంబంధించిన అంశాలు, లోపభూయిష్టమైన విభజన చట్టం, అందులోని సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఇప్పటికీ ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి’’ అనే విషయాలను ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకంలో ప్రస్తావించానని చెప్పారు ముఖ్యమంత్రికి, తనకు మధ్య ఉన్న భేదాభిప్రాయాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని తన తోటి ఐఏఎస్ అధికారి చందనాఖన్‌కు, కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ మురళి సాగర్‌కు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చినట్టు ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ప్రైవేటు, పార్టీ ప్రయోజనాలే ఎక్కువయ్యాయి ప్రస్తుత పాలనలో ప్రజా ప్రయోజనాల కంటే ప్రైవేటు, పార్టీ ప్రయోజనాలే ఎక్కువయ్యాయని ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తోంటే వైరాగ్యం, విరక్తి కలుగుతున్నాయన్నారు. వ్యవస్థలన్నిటినీ కుప్పకూల్చారని వాపోయారు. నాకేమిటి, నా పార్టీకేమిటి అనే ఉద్దేశంతోనే పని చేస్తున్నారని విమర్శించారు. పౌరుల తీరులో మార్పు రావాలని, ప్రశ్నించే తత్వం చూపాలన్నారు. ప్రజల్లో మార్పు తేవడానికే ఐవైఆర్ ఈ పుస్తకాన్ని బయటకు తెచ్చారన్నారు. ఎక్కడకు వెళ్లినా రాజకీయాల్లోకి వస్తున్నారా అని అడుగుతున్నారని, లోపాలను బహిర్గతం చేయడానికి రాజకీయాల్లోకే రావాలా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ, చందనాఖన్, హన్స్ ఇండియా సంపాదకులు రాము శర్మ తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్ నుంచి యూజర్ చార్జీలు
ఆస్పత్రులతో సహా అన్ని ప్రభుత్వ సేవలకు సొమ్ము వసూలు ⇒ ఆర్థిక వనరుల సమీకరణపై వ్యూహాలు రచించండి ⇒ టెలిఫోన్, పెట్రోల్, పత్రికల బిల్లులు పరిమితికి మించితే సంబంధితులే భరించాలి ⇒ జీరోస్థాయి బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించిన ఆర్థికశాఖ ⇒ ఈ నెల 31 వరకు శాఖాధిపతులతో సమావేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి యూజర్ చార్జీల మోత మోగనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీరోస్థాయి బడ్జెట్‌ను రూపొందిస్తున్న ప్రభుత్వం అందుకు సంబంధించి అన్ని శాఖలకు మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలను జారీచేసింది. ప్రతి శాఖ ప్రణాళిక-ప్రణాళికేతర పద్దుల కింద చేసే కేటాయింపులకు ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి వ్యూహాన్ని రచించుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఇందుకోసం పన్నులను, పన్నేతర వనరులను మరింత సమర్థంగా వసూలు చేయడంతో పాటు ప్రజల నుంచి వాటా రూ పంలో కొన్ని నిధులను సేకరించడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, యూజర్ చార్జీల వసూళ్లతోపాటు కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకోవడంపై దృష్టి సా రించాలని సూచించారు. ఆస్పత్రులతోపాటు స్థానిక సంస్థలతో సహా ప్రభుత్వం అందించే అన్ని రకాల పౌరసేవలకు యూజర్ చార్జీలు వసూలు చేయనున్నారు. ఇందుకోసం ప్రతి మూడు నెలలకు, ఆర్థిక సంవత్సరానికి లక్ష్యాలను నిర్ధారించుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ లక్ష్యాలు సాధించాలని పేర్కొన్నారు. అవసరాలకు అనుగుణంగా ఫలితాలు సాధించేలా జీరోస్థాయి బడ్జెట్ రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు.. ⇒ ప్రస్తుతం ఉన్న పథకాలు, కార్యక్రమాలను పూర్తిస్థాయిలో సమీక్షించి అవసరం లేని వాటిని రద్దుచేస్తారు. పథకాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యతలు, లక్ష్యాలు నిర్ధారిస్తారు. ⇒ ఇప్పటికే మంజూరై పనులు ప్రారంభమైన పథకాలన్నింటినీ సమీక్షిస్తారు. మంజూరైనా పనులు ప్రారంభించని వాటిని రద్దుచేస్తారు. ⇒ పెండింగ్ బిల్లుల వివరాలను సేకరించి వాటి వాస్తవికతను ఒకసారి పరిశీలించాలి. వాటి చెల్లింపునకు ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద ప్రాధాన్యత క్రమంలో నిధుల కేటాయింపునకు ప్రతిపాదించాలి. ⇒ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అర్హతను సమీక్షించాలి. ఇందుకోసం సాంకేతిక సహకారం తీసుకోవడం ద్వారా తక్కువ ఆర్థిక వనరులతో లక్ష్యాలను సాధించాలి. ⇒ అన్ని శాఖలు ఉద్యోగుల సంఖ్య, వారికి తగి నట్లు పని ఉందా లేదా సమీక్షించాలి. మిగు లు ఉద్యోగులుంటే వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి ఉత్పాదకత పెంచే రంగాల్లో వారి సేవలను వినియోగించుకోవాలి. ⇒ సచివాలయం నుంచి మండల స్థాయి అధికారులు, ఉద్యోగుల వ్యక్తిగత పనితీరును అంచనా వేయాలి. అన్ని స్థాయిల్లోనూ త్రైమాసిక, వార్షిక లక్ష్యాలను నిర్ధారించటంతోపాటు ఆ లక్ష్యాలను సాధించిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. లక్ష్యాలు సాధించని వారికి కోతలు పెట్టాలి. ⇒ ప్రణాళికేతర పద్దు కింద కార్యాలయాల నిర్వహణ వ్యయం వీలైనంత తక్కువగా ఉండాలి. ఇందుకు ఆ కార్యాలయ ఉన్నతాధికారులే బాధ్యత వహించాలి. ⇒ నీటి చార్జీలు, విద్యుత్, టెలిఫోన్, పెట్రోల్ చార్జీలు, భవనాల అద్దెలను కొత్త ధరల ఆధారంగా లెక్కగట్టి పెండింగ్, భవిష్యత్తులో అయ్యే మొత్తాన్ని ప్రతిపాదించాలి. ⇒ చట్టబద్ధమైన సంస్థల కార్యాలయాల అద్దెలను నెలలు, సంవత్సరాల తరబడి చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. అద్దె బిల్లులను మూడు నెల ల తరువాత కూడా చెల్లించకపోతే సంబంధిత శాఖాధిపతి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఆర్థిక సంవత్సరంలో అటువంటి బిల్లులను పరిష్కరించని పక్షంలో బడ్జెట్ కేటాయింపులు మురిగిపోతాయి. తరువాత ఆ బడ్జెట్లో కేటాయించరు. సకాలంలో చెల్లించని అధికారి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసి అద్దె చెల్లిస్తారు. ⇒ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ తక్కువ వినియోగం అయ్యే బల్బులు, సాధనాలను వినియోగించాలి. శాఖాధిపతులందరూ విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పు డు పరిశీలిస్తూ వీలైనంత తక్కువ విద్యుత్ బిల్లులు వచ్చే చర్యలు చేపట్టాలి. విద్యుత్ బిల్లుల్ని క్రమం తప్పకుండా చెల్లించాలి. ⇒ అధికారులు, ఉద్యోగులకు కేడర్, హోదా వారీగా ఇంటి టెలిఫోన్, నెలవారీ పెట్రోల్, డీజిల్ కోటాతో పాటు అద్దె వాహనం, నిర్వహణ, పత్రికలకు సంబంధించి వ్యయాన్ని ప్రభుత్వం నిర్ధారించింది. నిర్ధారించిన మొత్తానికి మించి పైసా కూడా ఇవ్వరు. ఎక్కువ వ్యయం అయితే వ్యక్తిగతంగా వారే చెల్లించుకోవాలి. సమీక్షించిన అజేయ కల్లం జీరో స్థాయి బడ్జెట్‌పై బుధవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లం శాఖాధిపతులతో సమీక్షలు ప్రారంభించారు. వ్యవసాయ, పౌరసరఫరాలు, పశు సంవర్థక, గృహనిర్మాణ రంగాల ఉన్నతాధికారులతో సమీక్షించారు. గురువారం ఉన్నత, పాఠశాల విద్య, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖల ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలతో పాటు ఏడు రంగాలకు సంబంధించి ప్రకటించిన మిషన్ల ఆధారంగా జరుగుతున్న ఈ సమీక్షలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి.