
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పాలనా సంస్కరణలపై హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్‌మాన్ ప్రశంసలు కురిపించారు. కాన్సులేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాలతో పాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. అవినీతి రహిత, పారదర్శక, సుపరిపాలనలో భాగంగా తీసుకొచ్చిన విధానాల గురించి రిఫ్‌మాన్‌కు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఆమేరకు తగిన కృషి చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు.
గవర్నర్‌తోనూ భేటీ..
అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్‌మాన్ బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అమెరికా తోడ్పాటు అందించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తోడ్పాటు అందించాలన్నారు. దీనిపై రిఫ్‌మాన్ సానుకూలంగా స్పందిస్తూ విశాఖపట్నం స్మార్ట్‌సిటీ అభివృద్ధి ప్రాజెక్టుకు తాము సహకారం అందిస్తున్నామని చెప్పారు. తాను మంగళవారం విశాఖపట్నంలో పర్యటించి ఆ ప్రాజెక్టు పనులను పరిశీలించానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జునరావుతోపాటు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ సభ్యులు పాల్గొన్నారు.