రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కాపు రుణమేళా సదస్సుకు పెద్ద సంఖ్యలో వాహనాలు రానున్నందున ట్రాఫిక్
ఏలూరు (మెట్రో) : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కాపు రుణమేళా సదస్సుకు పెద్ద సంఖ్యలో వాహనాలు రానున్నందున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా మంగళవారం స్థానిక ఇండోర్ స్టేడియంలో పోలీస్ ఇంటిల్‌జెన్సీ స్పెషల్ బ్రాంచి, డీఎస్పీ, ఇతర జిల్లా అధికారులతో ఆయన ఏర్పాట్లను పరిశీలించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వెయ్యి బస్సుల్లో కాపులు రుణమేళాకు హాజరవుతున్నట్టు సమాచారం అందిందని, వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని జేసీ కోరారు. సభకు వచ్చే వాహనాలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్, కేపీడీటీ కాలేజ్, అశోక్‌నగర్, మినీ బైపాస్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ కేటాయించాలన్నారు. సీఆర్ రెడ్డి కళాశాల గ్రౌండ్స్‌లో ప్రత్యేక హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నామని 25న ఉదయం హెలికాఫ్టర్‌లో ఏలూరు చేరుకుంటారన్నారు. అదనపు జేసీ షరీఫ్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీమన్నారాయణ, డీపీవో ఆర్‌వీ సూర్యనారాయణ, డీఎస్పీ జి.వెంకటేశ్వరరావు, ఆర్డీవో నంబూరి తేజ్‌భరత్ పాల్గొన్నారు.