మానవత్వానికి మరోపేరు జాన్‌డేవిడ్ | jandevid Another name to humanity | Sakshi
Sakshi News home page

మానవత్వానికి మరోపేరు జాన్‌డేవిడ్

Jan 10 2014 12:43 AM | Updated on Sep 2 2017 2:26 AM

మానవత్వానికి మరోపేరు దివంగత డాక్టర్ ఎస్ జాన్‌డేవిడ్ అని ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ డెరైక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్ మహంతి పేర్కొన్నారు.

చిలకలూరిపేట టౌన్, న్యూస్‌లైన్: మానవత్వానికి మరోపేరు దివంగత డాక్టర్ ఎస్ జాన్‌డేవిడ్ అని ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ డెరైక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్ మహంతి పేర్కొన్నారు. ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్, ఫార్ కార్నర్స్ స్వచ్ఛంద సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ జాన్‌డేవిడ్ 9వ వర్ధంతి ఏఎంజీ ప్రాంగణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఉదయం జాన్‌డేవిడ్ సమాధి వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.

అనంతరం గుండయ్యతోటలోని క్రిస్టియన్ అసెంబ్లీ నిరీక్షణ మందిరంలో ఫార్‌కార్నర్స్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. ఏఎంజీలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో సంస్థ డెరైక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్ మహంతి మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టిన జాన్‌డేవిడ్ ఎందరో నిరుపేదలకు బాసటగా నిలిచి మహనీయుడయ్యారని పేర్కొన్నారు. సాటివారిపై ప్రేమ, కరుణ కలిగి ఉండాలన్న ఏసుక్రీస్తు ప్రబోధాలను ఆచరించి చూపారన్నారు. ప్రస్తుతం ఏఎంజీ విద్యాసంస్థల్లో వేలాది మంది నిరుపేద విద్యార్థులు కులమతాలకు అతీతంగా విద్యాభ్యాసం చేస్తున్నారని తెలిపారు.

 కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఫార్‌కార్నర్స్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ డెరైక్టర్ డాక్టర్ జెస్సీ ఎస్. బర్నబాస్ మాట్లాడుతూ తన తండ్రి జాన్‌డేవిడ్ ఆశయాలమేరకు కుష్టు, టీబీ, ఎయిడ్స్ తదితర వ్యాధిగ్రస్త బాధితులకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా జీవితఖైదీల పిల్లలకు, ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల పిల్లలకు ఏఎంజీ ఆధ్వర్యంలో చేయూత  అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుదాసు, వేద విద్యాసంస్థల డెరైక్టర్ పెర్సీ స్వరూప, ఏఎంజీ వైస్ ప్రెసిడెంట్ కె.జాకబ్, సీఏవో విజయ్‌కుమార్, సీపీవో కృపారావు, ఏవో రవికుమార్, ఇవాంజిలికల్ మేనేజర్ జాన్‌రాజు, శిఖామణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement