
జానారెడ్డి
ఆయన అనుకున్నది ఒకటి అయిందొకటి. ఇప్పుడు ఏం చేయాలో తెలియక బిత్తర చూపులు చూస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తాను కీలక పాత్ర పోషిస్తానని భావించారు.
ఆయన అనుకున్నది ఒకటి అయిందొకటి. ఇప్పుడు ఏం చేయాలో తెలియక బిత్తర చూపులు చూస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తాను కీలక పాత్ర పోషిస్తానని భావించారు. కాబోయే ముఖ్యమంత్రిని తానేనని కూడా ప్రచారం చేసుకున్నారు. మొదట తెలంగాణ పీసీసీ పదవి తనకే దక్కుతుందని ఎదురు చూశారు. ఇప్పుడు అన్నీ అడియాశలయ్యాయి. కీలక పాత్రకాదు ఏ పాత్ర లేని పరిస్థితి. తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవిని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు అప్పగించారు. తెలంగాణకు దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేష్ ప్రకటించారు. దాంతో ఎన్నో కలలు కన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో అత్యధిక కాలం మంత్రిగా కొనసాగిన రికార్డు ఉన్న కుందూరు జానారెడ్డి ఒక్కసారిగా డీలాపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించానని - తెలంగాణ కాంగ్రెస్ నేతలు అందర్ని ఏకతాటిపై నడిపించింది తానేనని జానారెడ్డి చెప్పుకుంటూ ఉండేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎంతో కాలంగా ఉన్న ఆకాంక్ష నెరవేరింది. అయితే రాజకీయంగా తనకు రావలసిన ప్రాధాన్యత రాకపోవడంతో జానారెడ్డి డైలామాలో పడిపోయినట్లు తెలుస్తోంది. పిసిసి పదవి పొన్నాలకు దక్కడంతో జానారెడ్డి అనుచరులు ఇస్తుపోయారు. ఇదేంటబ్బా అని నోళ్లు వెళ్లబెట్టుకుంటున్నట్లు సమాచారం. చివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా తనకు కట్టబెట్టకుండా తన జిల్లాకే చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి కట్టబెట్టడంపై జానారెడ్డి షాక్‌కు గురయ్యారని చెప్పుకుంటున్నారు. అయితే, ఆ జిల్లా ప్రజలు మాత్రం జానారెడ్డికి భాషాపరమైన సమస్య ఉందని, అందువల్లనే ఆయనకు పదవి దక్కలేదని చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లో సీనియర్ అయినప్పటికీ, అధిష్టానం దగ్గర మాట్లాడటంలో ఆయన వెనక ఉంటారని కాంగ్రెస్ నేతలే చెప్పుకుంటున్నారు.
భాషాపరమైన సమస్య ఉన్న విషయం జానారెడ్డి కూడా తెలుసు. దానిని అధిగమించడానికి, హిందీ, ఇంగ్లీష్ అనర్ఘళంగా మాట్లాడాలన్న ఉద్దేశంతో ట్యూటర్లను కూడా పెట్టుకొని ఆయన ఈ రెండు భాషలు నేర్చుకుంటున్నాయి. ఈ వయసులో కూడా తిప్పలుపడుతూ భాషా పరిజ్ఞానంలో కొంత ప్రగతి కూడా సాధించారు. అయినా ఫలితం దక్కలేదు. కనుచూపు మేరలో అవకాశాలు ఏమీ కనిపించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఏం మాట్లాడితే ఏం తంటా వస్తుందో అని తమాయించుకొని మాట్లాడుతున్నారు. కడుపు మంట ఆపుకోలేక ఈ రోజు ఉదయం ఢిల్లీ మాట్లాడుతూ స్టార్ హోటల్స్లో ఉండి పైరవీలు చేయలేదన్నారు. తాను పైరవీల కోసం ఢిల్లీ రాలేదని, అధిష్టానం పిలిస్తేనే వచ్చానని చెప్పారు. తాను వ్యక్తుల నేతృత్వంలో కాకుండా పార్టీ నేతృత్వంలోనే పనిచేస్తానని చెప్పారు. తెలంగాణ కోసం తాను పడ్డ కష్టం చరిత్రలో నిలుస్తుందని, ప్రజలు గుర్తుంచుకుంటారని సరిపెట్టుకున్నారు.
ఇదంతా ఒక ఎత్తేతే జానారెడ్డికి ఇంట్లో నుంచి కూడా ఒక కొత్త రాజకీయ సమస్య పుట్టుకు వచ్చింది. అదే వారసత్వ సమస్య. ఇది కూడా ఆయనకు ఇబ్బంది కలిగిస్తోందని చెప్పుకుంటున్నారు. జానా వారసుడుగా రఘువీర్ రాజకీయాలలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలన్న డిమాండ్ ఇంట్లోనుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో ఒక్కరికే టికెట్ అన్న ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫార్మూలతో అసలుకే ఎసరవస్తుందేమోనని ఆయన ఆందోళన పడుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కావాలన్న తన లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో కూడా నెరవేరే అవకాశం కనిపించకపోవడంతో రఘువీర్‌కు తన రాజకీయ వారసత్వం అప్పగించి రిటైర్‌మెంట్ అవ్వాలి జానారెడ్డి అనుకుంటున్నట్లు వినవస్తోంది.