రాజధాని బాండ్లు రాష్ట్రానికి గుదిబండ!

IYR Krishna rao comments on CM Chandrababu - Sakshi

     మెగా రాజధాని మానియాతో ప్రమాదకర పంథాలో ముఖ్యమంత్రి

     ఇలా చేస్తేనే బ్రెజిల్‌ను మిలటరీ స్వాధీనం చేసుకుంది

     ఇచ్చిన నిధులకు లెక్కలడిగితే ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటుందా?

     అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

     రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ధ్వజం 

సాక్షి, అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చాలా ప్రమాదకరమైన పంథాలో వెళుతున్నారని, రాజధాని బాండ్లు రాష్ట్ర భవిష్యత్తుకు గుదిబండగా మారుతాయని మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు హెచ్చరించారు. రాజధాని నిర్మాణానికి ప్రజల నుంచి బాండ్ల రూపంలో నిధులు సేకరించనున్నట్లు సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వాణిజ్యపరంగా చూస్తూ మెగా రాజధాని నిర్మాణం విజయవంతమైన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవని, బ్యాంకు వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీకి నిధులు సేకరిస్తే అది చివరికి రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందన్నారు.

బ్రెజిల్‌ దేశంలో మౌలిక వనరులన్నీ సమీకరించి రాజధానిని నిర్మిస్తే చివరికి అది ఆర్థిక సంక్షోభానికి దారితీసి దేశాన్ని మిలటరీ హస్తగతం చేసుకుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదే విధంగా పెట్రోలియం డాలర్లతో ఇబ్బడిముబ్బడిగా వచ్చిన నిధులతో మలేసియా, నైజీరియా వంటి దేశాలు రాజధాని నగరాలు నిర్మిస్తే.. ఆ నిధులను ఇతర అవసరాలకు వినియోగించే ఉంటే మరింత అభివృద్ధి చెందేవారన్న విమర్శలను పెద్ద ఎత్తున ఎదుర్కొన్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మూడు పెద్ద నగరాలున్నాయని, ఇప్పుడు రాజధాని పేరుతో మరో మెగా సిటీ అవసరం లేదని, పరిపాలన రాజధాని నిర్మిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్‌ శివరామకృష్ణ.. మెగా రాజధాని నిర్మాణం వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఏ విధంగా దెబ్బతింటుందన్న విషయాన్ని విపులంగా హిందూ పత్రికలో వ్యాసాన్ని రాశారని, ఇప్పటిౖకైనా సీఎం ఈ మానియా నుంచి బయటకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆత్మగౌరవం పేరుతో రెచ్చగొట్టొద్దు..
తాము ఇచ్చిన నిధులకు కేంద్రం లెక్కా పత్రాలు అడగడంతో ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిందంటూ సీఎం బుధవారం అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఐవైఆర్‌ తప్పుపట్టారు. కాగ్‌ అనేది కేవలం అకౌంటింగ్‌ సంస్థ మాత్రమేనని, ఎన్నికల హామీ అయిన రుణ మాఫీ వ్యయాన్ని కూడా లోటు కింద భర్తీ చేయాలంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లు వస్తాయి కాబట్టి కేంద్రం తిరస్కరించిందన్నారు. కేంద్రం ఇతర పథకాలు, ప్రాజెక్టులకు ఇచ్చిన నిధులకు మాత్రమే యూసీలను అడుగుతుందని, ఆ నిధులు సరిగా వినియోగమయ్యాయా లేక వేరే పథకాలకు మళ్లించారా అని తెలుసుకున్న తర్వాతనే మిగిలిన నిధులు విడుదల చేస్తారన్నారు. యూసీలను ఆత్మగౌరవంతో ముడిపెట్టి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడం తగదన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top