ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో ఆన్‌లైన్‌ కష్టాలు

Issues in EAMCET certificates verification - Sakshi

     సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో స్వల్ప సమస్యలు

     ఫీజు చెల్లించినా రాని రసీదులు

     రాని లాగిన్‌ ఐడీ, రిజిస్ట్రేషన్‌ నెంబర్‌

     అఫ్లియేషన్‌ జాప్యంతో తేలని కాలేజీల జాబితా

     నేటి నుంచి వెబ్‌ ఆప్షన్లకు అవకాశం

సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో: ఎంసెట్‌–2018 కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు ఆన్‌లైన్‌ కష్టాలు ఎదురవుతున్నాయి. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించిన కొంతమందికి ఫీజు రూ.1200 వారి బ్యాంకు ఖాతాల నుంచి కట్‌ అయినట్లు చూపించినా రసీదు రాలేదు. కౌన్సెలింగ్‌ అధికారులను సంప్రదించగా సాంకేతిక కారణాలతో అలా జరిగి ఉంటుందని, కట్‌ అయిన నగదు తిరిగి అకౌంట్లలోకి చేరుతుందని వివరించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో కూడా సమస్యలు తలెత్తాయి. మంగళవారం విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడంతో  అదనంగా మరో ఐదు హెల్ప్‌లైన్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

లాగిన్‌ ఐడీ, రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ రాక ఇబ్బందులు
రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయినా లాగిన్‌ ఐడీ, రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. వీటిని ఎప్పటికప్పుడు విద్యార్థుల మొబైల్‌ నెంబర్లకు మెసేజ్‌ చేస్తున్నా వెళ్లకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం వరకు 60 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్‌ చేసుకొని, ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసుకోగా వారికి మళ్లీ మరోసారి లాగిన్‌ ఐడీ, రిజిస్ట్రేషన్‌ నెంబర్లను పంపించే ఏర్పాట్లు చేశామని ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ వరదరాజన్, అడ్మిషన్ల ప్రత్యేకాధికారి డాక్టర్‌ రఘునాధ్‌లు తెలిపారు. ఎంపీసీ విద్యార్థులకు మాత్రమే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని బైపీసీ విద్యార్థులకు మరో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని చెప్పారు. జూన్‌ మూడో వారం తర్వాత బైపీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించే అవకాశముంది. 

వర్సిటీల నుంచి అందని అఫ్లియేషన్ల సమాచారం
2018–19కి సంబంధించి 289 ఇంజనీరింగ్, 112 ఫార్మసీ కాలేజీల్లో 1,56,286 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. ఇందులో 10,228 ఫార్మసీ సీట్లు కాగా తక్కినవన్నీ ఇంజనీరింగ్‌ సీట్లు. ఆయా కాలేజీలకు సంబంధించి యూనివర్సిటీల గుర్తింపు ప్రక్రియ పూర్తికాకపోవడంతో గందరగోళం నెలకొంది. నేటి నుంచి ఆప్షన్ల నమోదుకు షెడ్యూల్‌ ప్రకటించినా మంగళవారం రాత్రి వరకు కూడా వర్సిటీల నుంచి కాలేజీల సమాచారం అందలేదు. అయితే కాలేజీల సమాచారం అప్‌లోడ్‌ అవుతోందని బుధవారం ఉదయం 11 గంటల తర్వాత నుంచి విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని రఘునాధ్‌ చెప్పారు. 

ఆప్షన్ల నమోదులో జాగ్రత్తలు తీసుకోవాలి
ఆప్షన్ల నమోదులో జాగ్రత్తలు పాటించాలని రఘునాధ్‌ కోరారు. విద్యార్థులు ఎలాంటి కాలేజీలో, ఏ విభాగంలో సీటు కావాలనుకుంటున్నారో ముందుగా స్పష్టతకు రావాలన్నారు. ఆర్థిక పరిస్థితికి వీలుగా, తమ ప్రాంతానికి సమీపంలోని కాలేజీల్లో సీటు కావాలనుకునేవారు అలాంటి కాలేజీలు ఏవి? అందులోని సదుపాయాలు? బోధన తీరు పరిశీలించాలని చెప్పారు. తమ ర్యాంకుకు గతంలో ఏ కాలేజీలో, ఏ విభాగంలో సీటు వచ్చిందో చూసుకోవాలని, ఫీజుల వివరాలు కూడా తెలుసుకోవాలన్నారు. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే ముందు తమకు కావలసిన కాలేజీలు, కోర్సులను ప్రాధాన్యత ప్రకారం ఒక కాగితంపై రాసుకోవాలని తెలిపారు. ఆప్షన్లు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా ప్రతిసారీ సేవ్‌ చేస్తూ ఉండాలని సూచించారు. ఇంటర్నెట్‌ సెంటర్లలో ఆప్షన్లు ఇచ్చేవారు ప్రతిసారీ సేవ్‌ చేస్తూ చివర్లో లాగౌట్‌ చేయడంతోపాటు బ్రౌజర్‌ను కూడా ఆఫ్‌ చేయించాలన్నారు. లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పకూడదన్నారు.

రెండుసార్లు ఫీజు కట్టినా మెసేజ్‌ రాలేదు 
మీసేవా సెంటర్‌లో ఇప్పటికి రెండుసార్లు రూ.1200 వంతున ఫీజు చెల్లించినా కన్ఫర్‌మేషన్‌ మెసేజ్‌ రాలేదు. ఆందోళనతో హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు వచ్చాను. సీటు వస్తుందో, రాదోనని భయంగా  ఉంది. 
–ఎ. మహేష్, విద్యార్థి, లింగపాలెం, పశ్చిమగోదావరి 

లాగిన్‌ ఐడీలు రాక ఎక్కువమంది వస్తున్నారు
రిజిస్ట్రేషన్‌   నంబర్లు, లాగిన్‌ ఐడీలు రాకపోవడంతో హెల్ప్‌లైన్‌ సెంటర్లకు వస్తున్నారు. సాంకేతిక లోపంతో విద్యా ర్థుల మొబైల్‌ నెంబర్లకు మెసేజ్‌లు రాకపోవడం సమస్యగా మారింది.  
 –శ్రీరంగం, కో–ఆర్డినేటర్, ఆంధ్రా లయోలా కాలేజ్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top