మౌలిక వసతులకే పెద్దపీట

An industrial park in each district - Sakshi

నూతన పారిశ్రామిక విధానానికి సర్కారు కసరత్తు 

ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామిక పార్కు 

ఒక రంగానికి ఒకే రకమైన రాయితీలు 

ఈ నెలాఖరుకు ముసాయిదా సిద్ధం 

అనంతరం అన్ని రంగాల ప్రతినిధులతో చర్చలు 

కంపెనీలకు అవసరమైన మానవ వనరులపై దృష్టి

సాక్షి, అమరావతి: కొత్త పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానం 2020 – 25 తయారీ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే కంపెనీలకు రాయితీల కంటే స్థానికంగా కల్పించే మౌలిక వసతులు, నిపుణులైన మానవ వనరుల కల్పన వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా నూతన విధానాన్ని రూపొందిస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడి రాయితీలు ప్రకటించడం కంటే కంపెనీ ఏర్పాటుకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఒకేచోట కల్పిస్తే కంపెనీలు వాటంతట అవే వస్తాయన్నది అధికారుల అంచనా. గత ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించినా సరైన మౌలిక వసతులు లేకపోవడంతో కంపెనీలు రాని విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ప్రతి జిల్లాలో కనీసం 100 ఎకరాల్లో తక్కువ కాకుండా ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్, నీరు, లాజిస్టిక్స్‌ దగ్గర నుంచి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచన.

ఇంతకాలం కేవలం ఐటీ రంగానికే పరిమితమైన ప్లగ్‌ అండే పే విధానాన్ని ఈ పార్కుల ద్వారా తయారీ రంగంలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యల్లో నిపుణులైన మానవ వనరుల లభ్యత ప్రధానమైనది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీలకు అవసరమైన నిపుణులను ముందుగానే అందుబాటులో ఉంచనున్నారు. ఒక కంపెనీ శంకుస్థాపన చేసిన రోజున ఎటువంటి మానవ వనరుల నిపుణులు కావాలో చెబితే ఆ కంపెనీ ప్రారంభించే నాటికి ఆ మేరకు సమకూరుస్తారు. ఇదే విషయాన్ని నూతన పారిశ్రామిక విధానంలో స్పష్టంగా పేర్కొననున్నారు.

ఈ నెలాఖరుకు ముసాయిదా సిద్ధం
ప్రస్తుత పారిశ్రామిక విధానం వచ్చే ఏడాది మార్చితో ముగియనుండటంతో 2020 ఏప్రిల్‌ 1 నుంచి నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి తీసుకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ముసాయిదా రూపొందిస్తున్నారు. ఇది రెండు వారాల్లో పూర్తవుతుందని, ఆ తర్వాత అన్ని రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమై ముసాయిదా పాలసీలో చేపట్టవలసిన మార్పులు, చేర్పులపై చర్చించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. ఇందుకు కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని, అందరికీ ఆమోదయోగ్యమైన నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం వెల్లడిస్తుందని చెప్పారు.

అన్నిటికీ కలిపి ఒకే పాలసీ
ఇప్పటి వరకు పారిశ్రామిక, ఐటీ, మెరైన్, బయోటెక్నాలజీ, ఫుడ్‌ ప్రాసెసింగ్, టూరిజం అంటూ రకరకాల పాలసీలు ఉండటం వల్ల ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. ఏ పాలసీలో ఏ రాయితీలు ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ గందరగోళానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఏయే రంగాలకి ఎటువంటి రాయితీలు, మౌలిక వసతులు కల్పిస్తున్నామో తెలియచేస్తూ ఒకే పారిశ్రామిక పాలసీ విడుదల చేయాలని పరిశ్రమల శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అదే విధంగా ఒక రంగానికి చెందిన కంపెనీలకు పోటీ పేరుతో ఇష్టమొచ్చిన విధంగా రాయితీలు ప్రకటించే వారు. ఈ విధానానికి అడ్డుకట్ట వేస్తూ ఒకే రంగానికి చెందిన కంపెనీలకు ఒకే రకమైన రాయితీలు ఇవ్వనున్నారు. ఈ దిశగా నూతన పారిశ్రామిక విధానంలో కీలక మార్పు తేనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top