వ్యాధి నిరోధక టీకాల స్పెషల్ డ్రైవ్ | Immunizations vaccinations special drive | Sakshi
Sakshi News home page

వ్యాధి నిరోధక టీకాల స్పెషల్ డ్రైవ్

Feb 7 2014 12:08 AM | Updated on Mar 28 2018 10:59 AM

మాతాశిశు సంరక్షణలో భాగంగా గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ నిర్మల్‌కుమార్ చెప్పారు.

తాండూరు, న్యూస్‌లైన్ : మాతాశిశు సంరక్షణలో భాగంగా గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ నిర్మల్‌కుమార్ చెప్పారు. తమ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో వ్యాధినిరోధక టీకాలు వేయించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. గురువారం జిల్లా ఆస్పత్రి (పీపీయూనిట్)లో వైద్య సిబ్బంది సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

 ‘జన్మనిచ్చే ఏ తల్లీ మరణించొద్దు...జన్మించిన ఏ శిశువూ మృతి చెందొంద’న్న లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా దశలవారీగా సమస్యాత్మక గ్రామాల్లో టీటీ, టీడీటీ తదితర ఏడు రకాల వ్యాధినిరోధక టీకాలను తల్లీబిడ్డలకు వేయనున్నట్టు ఆయన చెప్పారు. రెండేళ్లలోపు పిల్లలకు, గర్భిణులకు టీకాలు వేస్తామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ మొదటి విడత ఈ నెల 3న ప్రారంభమైందని శనివారంతో ముగుస్తుందని చెప్పారు. మళ్లీ ఈ కార్యక్రమాన్ని మార్చి 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు, ఏప్రిల్ 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు, మే 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విడతలవారీగా గ్రామాల్లో నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

 జిల్లాలోని 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో  2013-14 సంవత్సరానికిగాను సుమారు 40వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటివరకు 32వేల ఆపరేషన్లు జరిగాయని, ఇంకా 8వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాల్సి ఉందన్నారు. పీహెచ్‌సీలలో కు.ని. ఆపరేషన్ల లక్ష్యాలను పూర్తిచేయని ఆస్పత్రి బాధ్యులపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే పల్స్ పోలియో కార్యక్రమంలో పనిచేసిన సిబ్బందికి డబ్బులు చెల్లించని సూపర్‌వైజర్లపైనా చర్యలు ఉంటాయన్నారు.


 జననీ శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్‌ఎస్‌కె) కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకొని, రెండు రోజులపాటు చికిత్స పొందిన వారికి మందులు, రవాణా తదితర ఖర్చుల కింద ఒక్కో మహిళకు రూ.15వందలు చెల్లిస్తున్నామని చెప్పారు. సమావేశంలో కుటుంబ నియంత్రణ గణాంకాల అధికారి కృష్ణ, పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement