నకిలీలలు! | Illegality in the distribution of land | Sakshi
Sakshi News home page

నకిలీలలు!

Jan 12 2014 12:08 AM | Updated on Mar 28 2018 10:59 AM

పేద రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన భూ పంపిణీ అక్రమాలకు నిలయంగా మారింది. భూ పంపిణీ ముసుగులో క్షేత్రస్థాయి అధికారులు స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు.

 మంచాల, న్యూస్‌లైన్: పేద రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన భూ పంపిణీ అక్రమాలకు నిలయంగా మారింది. భూ పంపిణీ ముసుగులో క్షేత్రస్థాయి అధికారులు స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు. అవకతవకలకు, నకిలీ పాస్ పుస్తకాలకు మంచాల మండలం అడ్డాగా మారింది. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో లేని వారికి, స్థానికేతరులకు ఎడాపెడా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసేశారు.  గతంలో ఇక్కడ పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన తహసీల్దార్‌ల పేరిట నకిలీ ప్రొసీడింగ్‌లు తయారుచేసి వాటి ఆధారంగా పట్టా పుస్తకాలు ఇస్తున్నారు.

 రెవెన్యూ చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకొని అందినకాడికి దండుకుంటున్నారు. ఎవరు రూ.10వేలు ఇస్తే వారికి 5ఎకరాల పట్టా పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నారు. వాటిని బ్యాంకులో తాకట్టు పెడితే రుణాలు పొందే అవకాశం ఉండటంతో అధికారుల చేతులు తడుపుతూ పలువురు పోటీపడి అక్రమ పట్టాలు చేయించుకుంటున్నారు. ఇలా భూమి లేకుండానే   ఆరుట్ల, లోయపల్లి, దాద్‌పల్లి, చిత్తాపూర్  గ్రామాల్లో వందలాది మంది నకిలీ పట్టా పుస్తకాలు పొందారు..

 మిగులు భూమి అక్రమార్కుల పరం...
 ఆరుట్ల గ్రామం సర్వే నంబర్ 1363లో ప్రభుత్వానికి చెందిన 1527ఎకరాల 36గుంటల భూమిలో 387మంది లభ్ధిదారులకు 741.28 ఎకరాలు పంచారు. మిగతా భూమిలో 523 ఎకరాలు అక్రమార్కుల పరమైంది. స్థానికులతో పాటు ఇతర మండలాలకు చెందిన వారు రెవెన్యూ అధికారుల ప్రాపకం తో ఇక్కడ పట్టాలు పొందారు. అదే విధంగా దాద్‌పల్లి గ్రామంలోని 1వ సర్వే నంబర్‌లో 44.17ఎక రాల ప్రభుత్వ భూమిలో వాస్తవంగా 13మందికి పట్టాలు ఇచ్చారు.

 కానీ ప్రస్తుతం దాదాపు 40మంది దాకా ఈ భూమికి సంబంధించి అక్రమ పట్టాలు పొందారు. వీరిలో ఒకరు పట్టా పాస్ పుస్తకం బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆరుట్ల గ్రామానికి చెందిన ఓ ఆర్‌ఎంపీ ఐదేళ్ల క్రితం దాద్‌పల్లి గ్రామానికి వచ్చారు. ఆయన భార్య పేరిట 5ఎకరాల భూమిని బి/2702/1992 నంబర్‌తో నకిలీ ప్రొసీడింగ్ అధారంగా పట్టా పుస్తకం జారీ అయ్యింది. దీన్ని తాకట్టు పెట్టి బోడకొండ దక్కన్ గ్రామీణ బ్యాంకు నుంచి పంట రుణం తీసుకున్నారు. విషయం బయటికి పొక్కడంతో రెవెన్యూ అధికారులు ఆ పాస్ పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 పుట్టగొడుగుల్లా నకిలీ పాస్ పుస్తకాలు...
 ఇక లోయపల్లి రెవెన్యూ పరిధిలోని 334 సర్వే నంబర్‌లో 220.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా 127 ఎకరాలు పంచారు. కానీ ఈ సర్వే నంబర్‌లో 78మందికి 242.14 ఎకరాలకు సంబంధించి పాస్‌పుస్తకాలు ఉన్నాయి. భూమి ఉన్న దానికంటే  22.14 ఎకరాలు ఎక్కువగా కేటాయించినట్టు ఉండటం గమనార్హం. చిత్తాపూర్ గ్రామంలోని 92 సర్వే నంబర్‌లో 86.16 ఎకరాల ప్రభుత్వ భూమిలో 32మందికి 56 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. మిగిలిన భూమిలో 25 ఎకరాల వరకూ 12మంది రైతులు కబ్జాలో ఉన్నారు. వాస్తవంగా మిగిలింది  కేవలం 5.6 ఎకరాలు కాగా, మరో 22మంది ఎకరంన్నర చొప్పున 33 ఎకరాలు అక్రమ పట్టాలు చేసుకున్నారు.

 ఇలా భూమిలేకున్నా పట్టా పాసుపుస్తకాలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. ప్రభుత్వ భూముల విషయమై తహసీల్దార్ వెంకటేశ్వర్లును వివరాల కోసం సంప్రదించగా... రికార్డులను ఉన్నతాధికారులు తీసుకెళ్లారని చెప్పారు. ఇదిలా ఉంటే నకిలీ పాస్ పుస్తకాలను తాకట్టు పెట్టి ఆరుట్ల ఎస్‌బీహెచ్, బోడకొండ దక్కన్ గ్రామీణ బ్యాంకుల నుంచి పలువురు రుణాలు పొందారు. ఈ విషయమై ఆరుట్ల ఎస్‌బీహెచ్ మేనేజర్  విజయలలితను వివరణ కోరగా... స్థానిక రెవెన్యూ అధికారులు పట్టాలు నిజమైనవేనని ధ్రువీకరిస్తుండటంతో రుణాలు ఇవ్వాల్సి వస్తోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement