హుద్‌హుద్‌... మానని గాయం

Hud hud is a human injury - Sakshi

కళ్లెదుట మూడేళ్ల నాటి పీడకల

ఇంకా సాయం కోసం బాధితుల ఎదురుచూపు

నెరవేరని ప్రభుత్వ పెద్దల హామీలు  

సాక్షి, విశాఖపట్నం: సూపర్‌ సైక్లోన్‌లలో ఒకటిగా నిలిచిన హుద్‌హుద్‌ తుపాను విరుచుకుపడి నేటికి సరిగ్గా మూడేళ్లయింది. నాటి పెను తుపానుకు కకావికలమైన విశాఖపట్నం కాస్త తేరుకున్నప్పటికీ నాటి గాయాలు ఇంకా బాధితులను వెంటాడుతున్నాయి. అప్పట్లో ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు తుపాను హోరులో కలిసిపోయాయి. సరిగ్గా మూడేళ్ల క్రితం (అక్టోబర్‌ 12న) హుద్‌హుద్‌ ఉత్తరాంధ్రపై విరుచుకుపడి బీభత్సం సృష్టించింది. 61 మంది మృత్యువాత పడ్డారు. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 2.30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఒక్క ఈపీడీసీఎల్‌కే రూ.499 కోట్ల నష్టం వాటిల్లింది.  

అమలు కాని సీఎం హామీలు
 అప్పట్లో విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితిని సమీక్షించి ఇంతకంటే పెద్ద తుపాన్లు సంభవించినా తట్టుకునేలా వ్యవస్థలను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. విశాఖలో ఏడాదిలోనే పక్కా ఇళ్లు, మత్స్యకారులకు మోడల్‌ కాలనీలు నిర్మిస్తామని ప్రకటించారు. తుపాను బారిన పడిన 2,39,781 మంది రైతులకు రూ.2,300 కోట్ల పంట నష్టం వాటిల్లిందని, ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం రూ.209 కోట్లు అవసరమని లెక్కతేల్చారు. మూడేళ్లయినా ఇప్పటికీ సబ్సీడీ సొమ్ము అందని రైతులు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది.

ఇంకా రూ.8 కోట్లకు పైగా రైతులకు అందాల్సి ఉంది. ఇక అప్పట్లో కకావికలమైన మత్స్యకార కుటుంబాలు నేటికీ పూర్తిగా తేరుకోలేదు. 4,441 పడవలకు నష్టం వాటిల్లింది. దాదాపు 10వేల తెప్పలు కొట్టుకుపోయాయి. మొత్తం రూ.98.99 కోట్ల నష్టం వాటిల్లింది. రూ.49.69 కోట్లు సాయం చేస్తామని చెప్పినా కేవలం రూ.6.95 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు అందింది. చెరువులు, కాల్వలు వంటి 1,020 సాగునీటి వనరులు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు 59.81 కోట్లు అవసరమని గుర్తించినా ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదు. మూడు జిల్లాల్లో కలిపి మొత్తం రూ.21వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు లెక్క తేల్చి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. విరాళాల రూపంలో దాతలందించిన రూ.200 కోట్లకు లెక్కా పత్రం లేకుండా పోయింది.

పూర్తికాని హుద్‌హుద్‌ ఇళ్లు
ఉత్తరాంధ్రలో 4 లక్షలకుపైగా ఇళ్లు దెబ్బతినగా రూ.3,226 కోట్ల ఆస్తినష్టం వాటిల్లితే పరిహారం కింద రూ.77.51కోట్లు పంపిణీ చేశారు. తమకు   పరిహారం అందలేదని ఇప్పటికీ పెద్ద సంఖ్యలో బాధితులు కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. హద్‌హుద్‌ పునర్నిర్మాణం కోసం వరల్డ్‌ బ్యాంకు ఆర్థిక సహాయంతో చేపట్టిన ఏపీడీపీఆర్‌ ప్రాజెక్టు నేటికీ పట్టాలెక్కలేదు. విశాఖలో రూ.720 కోట్లతో చేపట్టిన భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ వ్యవస్థకు ఎట్టకేలకు ఈ నెల 9న సీఎం శంకుస్థాపన చేశారు. మిగిలిన రూ.1580 కోట్ల పనులకు టెండర్లు ఇటీవలే ఖరారయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top