‘ హైరిస్క్’ ఆదర్శంగా నిలవాలి | highrisk is inspiration to all | Sakshi
Sakshi News home page

‘ హైరిస్క్’ ఆదర్శంగా నిలవాలి

Feb 1 2014 11:13 PM | Updated on Sep 2 2017 3:15 AM

మాతా శిశు మరణాల నియంత్రణకు సిద్దిపేటలో తొలి ప్రయోగంగా చేపట్టిన ‘హైరిస్క్’ ప్రసూతి కేంద్రం దేశానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ సహానీ ఆకాంక్షించారు.

 సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్:
 మాతా శిశు మరణాల నియంత్రణకు సిద్దిపేటలో తొలి ప్రయోగంగా చేపట్టిన ‘హైరిస్క్’ ప్రసూతి కేంద్రం దేశానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ సహానీ ఆకాంక్షించారు. శనివారం స్థానిక ఎంసీహెచ్‌లో హైరిస్క్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ నేత ృత్వంలో ‘మార్పు’ ద్వారా హైరిస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిజేరియన్ కేసుల స్థితి గతులను పరిశీలిస్తే తెలంగాణ పరిధిలోని కరీంనగర్, న ల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాల్లో 50 శాతం నుండి 80 శాతం వరకు శస్త్ర చికిత్సలు జరగడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  కష్టతరహా కాన్పులను సులభతరం చేసేందుకే జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా హైరిస్క్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.
 
  ప్రసూతి కేసుల్లో 30 శాతం హైరిస్క్‌తో కూడిన పరిస్థితులను వైద్య శాఖ ఎదుర్కుటోందన్నారు. పేదలందరికీ మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతోనే ఆధునిక వసతులతో సిద్దిపేటలో కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కేంద్రం నిర్వహణకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తానని సహాని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 చోట్ల నవజాత శిశువు కేంద్రాలు కొనసాగుతున్నాయనీ, త్వరలో సిద్దిపేటలో కూడా నవజాత శిశువు హైరిస్క్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు ఈ కేంద్రాల్లో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. సుఖప్రసవాలకు వైద్యులు ప్రాధాన్యతనివ్వాలన్నారు. అత్యవసరమైతే తప్ప శస్త్రచికిత్సలు చేయరాదన్నారు.  
 
 జిల్లాలో మరిన్ని ‘హైరిస్క్’ కేంద్రాలు
 త్వరలోనే జిల్లాలో మరిన్ని ‘హైరిస్క్’ ప్రసూతి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్నారు. సిద్దిపేటలో హైరిస్క్ కేంద్రం ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే హరీష్‌రావు చూపిన చొరవ స్ఫూర్తి దాయకమన్నారు. ప్రభుత్వ వైద్యులు చిత్త శుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని కేంద్రం ప్రయోగాత్మకమైనప్పటికీ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేలా సమిష్టితో క ృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో హైరిస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు కేంద్రం దోహదపడుతుందన్నారు. కేంద్రం ఏర్పాటుతోనే బాధ్యత తీరదని, వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే లక్ష్యం సాధిస్తామన్నారు. కేంద్రానికి వచ్చే గర్బిణీలకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తూ, వారి బంధువులకు ప్రేమ ఆప్యాయతలతో కూడిన సేవలను వైద్యులు అందించాలన్నారు. సాధారణ కాన్పులను ప్రోత్సహించడం వల్ల పరోక్షంగా పేదలకు ఆర్థికంగా సహాయం చేసినట్లు అవుతుందన్నారు.  కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పద్మ, డీసీఏహెచ్ వీణాకుమారి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, సూపరింటెండెంట్ శివరాం, క్లస్టర్ అధికారులు శివానందం, కాశీనాథ్‌తో పాటు వైద్యులు అరుణ, కృష్ణారావు, టీఆర్‌ఎస్ నేతలు రాజనర్సు, మచ్చ వేణు, బాల్‌రంగం, రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, సాయిరాం, ప్రభాకర్, అశోక్, కనకరాజు తదితరులు ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement