కోర్టు పక్షులు

Highest Pending Cases In Visakhapatnam Court - Sakshi

పక్కనున్న కేసుల చిట్టా చూస్తే చాలు.. అధికార యంత్రాంగం విధి నిర్వహణలో ఎక్కువ సమయం వీటి విచారణలకే కేటాయించాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వేల సంఖ్యలో పెండింగులో ఉంటున్న కేసులు.. అధికారులను.. ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగాన్ని కోర్టు పక్షులుగా మార్చేస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌ నెలలో కనీసం రెండుమూడు రోజులు ఏదో ఒక కేసులో కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది. జేసీ, ఆర్డీవో స్థాయి అధికారులదీ అదే పరిస్థితి. భూసేకరణ వంటి విభాగాల అధికారులైతే వారంలో మూడు నాలుగు రోజులు కోర్టు కేసుల్లోనే మునిగిపోవాల్సి వస్తోంది. ఫలితంగా రెవెన్యూ శాఖలో రోజువారీ వ్యవహారాలు పెండింగులో పడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖ జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదవుతుంటే.. వాటి పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కూడా కేసులను పెండింగులో పడేస్తూ.. కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. 

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో మరెక్కడా లేనన్ని కోర్టు కేసులు ఒక్క విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. దాదాపు ఈ కేసులన్నీ భూ సేకరణ, భూ వివాదాలకు సంబంధించినవే. సుప్రీంకోర్టు మొదలుకొని హైకోర్టు, జిల్లా కోర్టు.. ఇతర కింది కోర్టుల్లోనూ వేల సంఖ్యలో కేసులు విచారణలో ఉన్నాయి. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే విశాఖ కలెక్టర్‌ నెలలో కనీసం ఒకటి రెండు రోజులు వీటి విచారణకు హాజరయ్యేందుకు ఢిల్లీ, హైదరాబాద్‌లకు వెళ్లాల్సి వస్తోంది. ఆయనే కాదు..జేసీ, ఆర్డీవోలు, తహసీల్దార్లు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత నాలుగేళ్లలోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

అలసత్వమే కారణం
జిల్లాలో నమోదవుతున్న వాటిలో రెవెన్యూ, ఇనాం, వక్ఫ్, దేవాదాయ భూముల ఆక్రమణల కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. అధికారుల అలసత్వం వీటి పరిష్కారంలో జాప్యాని కి.. ఎక్కువ రోజులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి దారితీస్తోంది. సకాలంలో కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో కింది కోర్టుల్లో పరిష్కరించుకోదగిన కేసుల్లో సైతం పై కోర్టుల ను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని కేసుల్లో అధికారుల వ్యవహరిస్తున్న తీరు ప్రత్యర్థులకు వరంగా మారుతోంది. దసపల్లా హిల్స్‌తో పాటు కొన్ని కీలకమైన భూ వివాదాల్లో ప్రైవేటు పార్టీలకు అనుకూలం గా తీర్పులొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 సివిల్‌ వివాదాలకు సంబంధించి.. సుప్రీంకోర్టులో నాలుగు, హైకోర్టులో 963, లోయర్, డిస్ట్రిక్ట్‌ కోర్టుల్లో 302, అప్పీల్స్‌ మరో ఐదు కలిసి మొత్తం 1274 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఉన్న నాలుగు కేసుల్లో కూడా కౌంటర్‌ ఫైల్‌ చేయాల్సి ఉంది. హైకోర్టు లో  ఉన్న  963 కేసులకు సంబంధిం చి 312 కేసుల్లో కౌంటర్‌ ఫైల్‌ చేయాల్సి ఉంది. సివిల్‌ వివాదాలకు సంబంధించి జిల్లా, కింద కోర్టుల్లో 302 రిట్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉంటే.. వాటిలో 67 కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంది. ఐదు కేసుల్లో మాత్రమే అప్పీల్‌కు వెళ్లగా వాటన్నింటికీ కౌంటర్స్‌ ఫైల్‌ చేయాల్సి ఉంది. ఆన్‌లైన్‌ లీగల్‌ కేసెస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఓఎల్‌సీఎంఎస్‌)కింద హైకోర్టులో 1585 కేసులు, కింద కోర్టుల్లో 96 కేసులు ఫైల్‌ కాగా.. ఇప్పటి వరకు హైకోర్టులో 656 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. రెవెన్యూ కోర్టుల్లో 560 కేసులు ఫైల్‌ కాగా.. 245 పరిష్కారమయ్యాయి. మరో 315 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇనాం కేసులు ఆర్డీవో కోర్టుల్లో 42, సీసీఎల్‌ఏ కోర్టులో 11 పెండింగ్‌లో ఉన్నాయి. 

గత 4 ఏళ్లలోనే అధికం
కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు రాష్ట్రంలో మరెక్కడా లేనంతగా విశాఖ జిల్లాలోనే ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉండగా.. వీటిలో అధిక శాతం కేసులు గత నాలుగేళ్లలో దాఖలైనవే కావడం గమనార్హం. భూసేకరణ వివాదాల కేసులు చాలా తక్కువగా ఉండగా.. ఎక్కువ శాతం ప్రభుత్వ, ప్రైవేటు భూ వివాదాలే. ఆక్రమణదారులకు కొమ్ముకాయడం..భూ కబ్జాలను ప్రోత్సహించడం  వల్లే అధికారులను పార్టీలుగా చేస్తూ బాధితులు కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి ఈ కేసులు కోర్టుల్లో నలుగుతుండడంతో దానికి బాధ్యులైన వారు ఎక్కడున్నా సరే కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వస్తోంది. కోర్టుల చుట్టూ తిరిగే విభాగాల్లో మొదటి స్థానంలో రెవెన్యూ యంత్రాంగం ఉండగా..ఆ  తర్వాత దేవాదాయ ధర్మదాయ శాఖ, అటవీ తదితర శాఖల అధికారులుంటున్నారు. ఈ ప్రభావం పాలనపై పడుతోందని అధికారవర్గాలు  పేర్కొంటున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top