నగరంలో హైఅలర్ట్‌

High Alert in Tirupati - Sakshi

ఆలయాలు, మాల్స్, రైల్వే, బస్‌ స్టేషన్ల వద్ద భద్రత పెంపు

అజ్ఞాత వ్యక్తులపై నిఘా

అర్బన్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌

చిత్తూరు, తిరుపతి క్రైం: దక్షిణాది రాష్ట్రాలలో ఉగ్రదాడులు ముప్పు పొంచి ఉండటంతో కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలపై పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. ఏపీ డీజీపీ ఆర్‌.పి. ఠాకూర్‌ బుధవారం అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. జలాశయ మార్గాలు, ఎయిర్‌పోర్టు ఉన్న ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.. శ్రీలంక నుంచి కొందరు తీవ్రవాదులు సముద్రమార్గాన ఆంధ్రాకు చేరే అకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరించడంతో అర్బన్‌ జిల్లాలో ఎస్పీ అన్బురాజన్‌ హైఅలర్ట్‌ ప్రకటించారు. భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో? ‘సాక్షి’తో ఎస్పీ మాట్లాడారు.

తిరుపతి అర్బన్‌ జిల్లా పరిధిలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అర్బన్‌ ఎస్పీ ఆదేశాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.  తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, పరిశ్రమలు, హాస్పిటల్స్, శ్రీనివాసం, విష్ణునివాసం మొదలగు టీటీడీ వసతి గృహాలు, అలిపిరి టోల్‌గేట్‌తో పాటు పలు ప్రాంతాల్లో విసృతంగా ఈ తనిఖీలు చేశారు. ప్రజలు అపరిచితుల విషయంలో ఉండాలని  అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధిక రద్దీ, దేవాలయాలు మాల్స్‌ వద్ద ఇప్పటికే భద్రత పెంచినట్లు అర్బన్‌ ఎస్పీ చెప్పారు. మాల్స్‌లో కూడా మెటల్‌ డిటెక్టర్లను గురువారం నుంచి ఏర్పాటు చేస్తామన్నారు.  నగరంలోని అనుమానిత వస్తువులు, వ్యక్తులను ప్రజలు గమనించినట్లయితే  పోలీస్‌ శాఖకు, పోలీస్‌ డైల్‌ 100, 8099999977  సమాచారమివ్వాలని కోరారు. అదేవిధంగా అంతర్జాతీయ రేణిగుంట విమానాశ్రయంలోనూ భద్రతను పెంచి, పాస్‌పోర్టులు ముమ్మరంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. నగరానికి వచ్చే రహదారుల్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేయడంతోపాటు అనుమానితులను ప్రశ్నించారు.

పుణ్యక్షేత్రాల వద్ద ప్రత్యేక నిఘా
తిరుమల, తిరుపతి, తిరుచానూరుతో పాటు శ్రీకాళహస్తి, శ్రీనివాసమంగాపురం, శ్రీవారిమెట్లు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలను చేశారు. అనుమానితులను విచారణ చేయడంతో పాటు వారి వద్ద నుంచి ధ్రువపత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర ఏ వాహనాలను వదలకుండా అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. పుణ్యక్షేత్రాల్లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు అన్బురాజన్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top