తలదించుకునే స్థితిలో వైద్యసేవలు | Health Minister Kamineni Srinivas about public sector medical services | Sakshi
Sakshi News home page

తలదించుకునే స్థితిలో వైద్యసేవలు

May 14 2015 3:58 AM | Updated on Sep 3 2017 1:58 AM

రాష్ట్రంలో ప్రభుత్వ రంగ వైద్యసేవల పరిస్థితి సిగ్గుతో తలదించుకునేలా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్

రాయదుర్గం టౌన్ : రాష్ట్రంలో ప్రభుత్వ రంగ వైద్యసేవల పరిస్థితి సిగ్గుతో తలదించుకునేలా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. వైద్య రంగాన్ని మెరుగుపరిచేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో రూ.3.82 కోట్ల నాబార్డు నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు బుధవారం ఆయనతోపాటు ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు శంకుస్థాపన, భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. 

వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం చేయాల్సిందే ఎంతో ఉందన్నారు. మాతాశిశు మరణాల సంఖ్య దక్షిణ భారత దేశంలోనే అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందజేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో 1412 మంది వైద్యులను  వివిధ విభాగాల్లో నియమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.  ఆస్పత్రులను అభివృద్ధి,  భవనాల మరమ్మతు, మందులు, వైద్యుల కొరత నివారణ, తదితర అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 

పెలైట్ ప్రాజెక్ట్ ద్వారా అనంతపురం జిల్లాలోని హిందూపురం, రాయదుర్గం ప్రభుత్వాస్పత్రుల్లో 35 రకాల డయాగ్నసిస్ పరీక్షల కోసం ప్రత్యేక ల్యాబ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. త్వరలో దీనిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహకారంతో రాష్ట్రానికి రూ.350 కోట్ల నాబార్డు నిధులు సాధించుకున్నామన్నారు. ఇందులో అనంతపురం జిల్లాకే రూ.47 కోట్లు కేటాయించమన్నారు.

సరిహద్దు ప్రాంతాలైన రాయదుర్గం, కణేకల్లులోని సీహెచ్‌సీలో అభివృద్ధి పనులకు రూ.6 కోట్ల నిధులు కేటాయించామన్నారు.  స్థానికుల విజ్ఞప్తి మేరకు త్వరలో రాయదుర్గం ఆస్పత్రికి గైనకాలజిస్ట్, అనేస్తీషియా డాక్టర్, చిన్న పిల్లల వైద్యున్ని నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు.  ప్రతి కాన్పూ ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగే విధంగా చూస్తామన్నారు. ఆయన తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. 

ఎమ్మెల్సీలు గేయానంద్, మెట్టు గోవిందరెడ్డి, మునిసిపల్ చైర్మన్ రాజశేఖర్, వైస్ చైర్మన్ కడ్డిపుడి మహబూబ్‌బాష, డీఎహెచ్‌ఓ ప్రభుదాస్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, డీసీహెచ్‌ఎస్ సత్యనారాయణ, ఏజేసీ ఖాజామొహిద్దీన్, కమిషనర్ రామచంద్రరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement