ధరలు రోజురోజుకూ పతనమవుతుండటంతో మిర్చి రైతులు ఈ ఏడాది సాగుచేయాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నారు.
పర్చూరు, న్యూస్‌లైన్: ధరలు రోజురోజుకూ పతనమవుతుండటంతో మిర్చి రైతులు ఈ ఏడాది సాగుచేయాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నారు. నెల రోజుల క్రితం క్వింటా రూ. 6500 ఉన్న సాధారణ రకం మిర్చి ధర ప్రస్తుతం రూ. 1500 తగ్గి రూ. 5 వేలకు చేరింది. విరివిగా వర్షాలు కురుస్తుండటంతో పాటు జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉంది. ఈ నేపథ్యంలో మిర్చి సాగు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ధరలు మరింత పతనమవుతాయన్న భయం రైతాంగంలో నెలకొంది. మిర్చికి ఏటా సాగు ప్రారంభంలో ధరలు ఆశాజనకంగా ఉంటాయి. అలాంటిది సాగు ప్రారంభంలోనే ధరలు పతనమవడంతో మిర్చి సాగు చేసేందుకు రైతులు జంకుతున్నారు. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏటా సుమారు 45 వేల హెక్టార్లలో మిర్చి సాగవుతుంది. 90 శాతం రబీలోనే సాగు చేస్తారు. ప్రస్తుతం రబీ సీజన్ ప్రారంభమైంది. ఈ తరుణంలో సాగు చేయాలా వద్దా అనే ప్రశ్న రైతాంగాన్ని వేధిస్తోంది. తగ్గుతున్న ధరలు వారిని పునరాలోచనలో పడేస్తున్నాయి.
ఎకరా మిర్చి సాగుకు హీనపక్షం లక్ష రూపాయలకుపైగా ఖర్చవుతుంది. దీనికి తోడు ఈ ఏడాది మిర్చి సాగు చేసే భూములకు కౌలు రూ. 20 వేల వరకు చేరింది. ఎరువులు, పురుగుమందులు, ఇతర వ్యవసాయ ఖర్చులు పెరిగాయి. ఈ నేపథ్యంలో సాగు ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. దిగుబడులు మాత్రం ఎకరాకు సరాసరిన 15-16 క్వింటాళ్లు మాత్రమే వస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారమైతే పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో సొంతంగా భూములున్న రైతులు మాత్రం కొంత మేర మిర్చి సాగుపై మొగ్గు చూపుతున్నా..కౌలు రైతులు వెనకాడుతున్నారు. గత ఏడాది మిర్చి సాగు చేసిన రైతుల్లో చాలా మంది శనగ పైరు కూడా సాగు చేశారు. గిట్టుబాటు ధరలు లేక శనగ పైరు రైతులకు నష్టాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ భారీ పెట్టుబడులు పెట్టి మిర్చి సాగు చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకన్న ఉద్దేశంలో కొందరు రైతులున్నారు.