ఆ'క్యాష్‌' మిర్చి: రూటే సపరేటు.. కిలో రూ.120 నుంచి రూ.140

Akash Green Chillies Farmers Karnataka Full Demand - Sakshi

కర్షకులకు సిరులు కురిపిస్తున్న మిర్చి 

సాధారణ మిర్చితో పోల్చితే నాలుగు రెట్లు కారం ఎక్కువ 

బయట రాష్ట్రాల్లో ఈ రకం మిర్చికి అధిక డిమాండ్‌ 

కాయలు కిందికి కాకుండా ఆకాశం వైపు చూడటం వీటి ప్రత్యేకత

కారంలోనే కాదు.. లాభాల్లోనూ నాలుగు రెట్లు ఘాటు అధికం..ఆ మిర్చి. ఆ రకం వంగడానికి కార్పొరేట్‌ కంపెనీలే దాసోసం అన్నాయి. అందుకే ఆ మిర్చి రకం కాయలు అధిక ధరలు పలుకుతున్నాయి. ఫలితంగా కర్షకుడి ఇంట సిరులు పంట పండుతోంది. సాగుదారుకు అధిక క్యాష్‌ ఇస్తున్నదే.. ఆకాష్‌ మిర్చి వంగడం. దీనిపై ప్రత్యేక కథనం. 

గుర్రంకొండ: కొత్తరకం ఆకాష్‌ మిర్చి(డెమెన్‌ ఎఫ్‌–1) సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. ప్రస్తుతం కిలో మిర్చి మార్కెట్లో రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతోంది. సాధారణ మిర్చితో పోల్చితే ఈ రకం మిర్చి నాలుగు రెట్లు అధికంగా కారం ఉంటుంది. బయట రాష్ట్రాల్లో ఈ రకం మిర్చికి అధికంగా డిమాండ్‌ ఉంది. సాధారణ మిర్చి కొమ్మకు కింది వైపు కాయగా ఆకాష్‌ మిర్చి కొమ్మకు పైభాగంలో ఆకాశాన్ని చూస్తుండటం వీటి ప్రత్యేకత. పంట సాగుతో రైతుకు నిలకడైన ఆదాయం వస్తుండడంతో గత మూడేళ్లుగా ఈ ప్రాంతం రైతులు మిర్చి పంట సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు.   

కర్ణాటకలో కొత్త వంగడం: 
ఆకాష్‌ మిర్చి రకం విత్తనాలు మొదట కర్ణాటక రాష్ట్రంలో నాలుగేళ్ల కిందట కనుగొన్నారు. ఓ ప్రైవేట్‌ కంపెనీ వారు ఈ రకం విత్తనాలు ఉత్పత్తి చేసి, మార్కెట్లో విక్రయిస్తున్నారు. మూడేళ్లుగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, పెద్దమండ్యం, గుర్రంకొండ మండలాల్లో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా కారం ఉండడంతో ప్రముఖ కంపెనీలైన ఆశీర్వాద్, ఆచీ కంపెనీలు తాము తయారు చేసే కారం పొడుల్లో ఆకాష్‌ మిర్చిని ఎక్కువగా వినియోగస్తుండడంతో వీటికి మంచి డిమాండ్‌ ఏర్పడింది.  

ఎకరా సాగుకు రూ. 1.50 లక్షలు ఖర్చు 
ఆకాష్‌ మిర్చి ఎకరం సాగుకు రూ.1.50 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో రబీ సీజన్‌ అంటే అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ 10వ తేదీలోగా నారు నాటుకోవాలి. ఎకరం పొలానికి రూ.10 వేల మొక్కల నారు అవసరం. మార్కెట్లో 10 వేల మొక్కల నారుకు రూ.10 వేలు చెల్లించాలి. దుక్కి నుంచి మల్చింగ్, డ్రిప్‌ పైపులు, వారానికి రెండు సార్లు పురుగు నివారణ మందుల పిచికారీ,  ఎరువులు తదితర అన్ని ఖర్చులు ఎకరాకు రూ. 1.50 లక్షలు వరకు అవుతాయి.  

ఎకరానికి సుమారు రూ.20 లక్షల ఆదాయం 
ప్రస్తుతం మార్కెట్లో కిలో మిర్చి రూ. 120 నుంచి రూ.130 వరకు ధరలు పలుకుతున్నాయి. ఈ సీజన్‌ అంతా సరాసరి రూ.80 నుంచి రూ.100 వరకు ధరలు తగ్గకుండా పలుకుతుంటాయి. దీంతో సాగు ఖర్చు పోను ఎకరానికి సరాసరి కనీసం రూ. 10 లక్షల నుంచి అత్యధికంగా రూ.20 లక్షల వరకు రైతులకు మిగులుతోంది. ఒక వేళ ధరలు లేక పోయినా ఎండుమిర్చి కింద వీటిని వాడుకున్న రైతులకు సాగు పెట్టుబడికి ఢోకా ఉండదు.  

నాలుగు రెట్లు అధిక కారం  
ఆకాష్‌ మిర్చి సాధారణ మిర్చి కంటే నాలుగు రెట్లు అధికంగా కారం ఉంటుంది. సా«ధారణ మిర్చి తొడిమి ఒక ఇంచి లోపు ఉండగా ఈ రకం మిర్చి తొడిమి రెండు నుంచి రెండున్నర అంగుళాల పొడవు ఉండడం విశేషం. సాధారణ మిర్చి నాలుగు కిలోలకు  ఆకాష్‌మిర్చి ఒక కిలో సమానం అవుతుంది. దీంతో బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో వీటికి మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా హోటళ్లు, పీజీ హాస్టళ్లలో వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు.  

మొక్కలో ఆకాశం వైపు చూస్తున్న మిరప కాయలు 

ఎకరానికి 10 నుంచి 20 టన్నుల దిగుబడి 
మొక్క నాటిన 80 నుంచి 90 రోజులకు పంట దిగుబడి ప్రారంభమవుతుంది. సాధారణంగా ఎకరం పంటకు అత్యల్పంగా 10 టన్నుల నుంచి అత్యధికంగా 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సుమారు రెండు నుంచి మూడు నెలల వరకు కాయల దిగుబడి వస్తుంది. మంచి ఎరువులు వాడుతూ పంటను కాపాడుకుంటే అత్యధికంగా నాలుగు నెలల వరకు దిగుబడి వస్తుంది.  

లాభదాయక పంట 
ఆకాష్‌ మిర్చి మంచి లాభదాయక పంట. మిగిలిన పంటలతో పోల్చితే ఈ రకం  మిర్చి సాగుతో ఎప్పుడు నష్టం ఉండదు. మార్కెట్లో సాధారణ ధరలు ఉన్నా కిలో రూ. 70 వరకు ధర పలుకుతుంది. మంచి డిమాండ్‌ ఉంటే కిలో రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతుంది.     – జయమ్మ, మహిళా రైతు, దిగువ పల్లె 
 
మూడేళ్లుగా సాగు చేస్తున్నా 
ఆకాష్‌ మిర్చి పంటను మూడేళ్లుగా సాగు చేస్తున్నా. ఎకరానికి రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అయితే ఎప్పుడూ నష్టాలు రాలేదు.   అన్ని సార్లు పెట్టుబడి పోను లాభాలే వచ్చాయి.      – చెంగల్రాయులు, రైతు, కొత్తపల్లె  

ఇక్కడి వాతావరణం అనువైంది 
కొత్త రకం ఆకాష్‌ మిర్చి పడమటి మండలాల వాతావరణానికి అనువైంది.మార్కెట్లో ఈ రకం మిర్చికి మంచి గిట్టుబాటు ధరలున్నాయి. దీంతో నిలకడైన ఆదాయం ఉన్న ఈ పంట రైతులకు మంచి ఆదాయం తెచ్చిపెడుతోంది.      – శైలజ, ఉద్యానవనశాఖాధికారి, వాల్మీకిపురం క్లస్టర్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top