పవన్‌ నీస్థాయి దిగజార్చుకోవద్దు

Grandhi Srinivas Comments On Pawan Kalyan - Sakshi

సాక్షి, భీమవరం: జనసేన అధ్యక్షుడిగా రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడాల్సిన పవన్‌ కల్యాణ్‌ భీమవరంలో పరిస్థితులు తెలియకుండామాట్లాడి స్థాయిని దిగజార్చుకోవడం, ప్రజల్లో చులకన కావడం పవన్‌ అభిమానిగా బాధించిందని వైఎస్సార్‌ సీపీ భీమవరం నియోజవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు.   శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తన హయాంలో భీమవరంలో జరిగిన అభివృద్ధి గురించి తెలియని వారు చెప్పిన మాటలు విని అవగాహన రాహిత్యంతో ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్‌ గత ఐదేళ్లుగా టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీలతో జతకడితే లేని తప్పు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని టీఆర్‌ఎస్‌తో వైఎస్సార్‌ సీపీ కలసి పనిచేస్తే తప్పేంటని  శ్రీనివాస్‌ ప్రశ్నించారు.

తాను 2004లో ప్రజాభిమానంతో ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, పట్టణ ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడానికి 120 ఎకరాల భూమి సేకరించి దానిలో 60 ఎకరాల్లో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు ఏర్పాటు చేశానన్నారు. పేదల సొంతింటి కల నెలవేర్చడానికి 82 ఎకరాల భూమి సేకరించానని, అంతేకాకుండా 700 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చామని చెప్పారు. యనమదుర్రు డ్రైన్‌పై బ్రిడ్జిలు, బైపాస్‌ రోడ్డు నిర్మించామన్నారు. గత పదేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బైపాస్‌ రోడ్డు వద్ద రైల్వే గేట్‌ ఏర్పాటు చేయించలేకపోయారని విమర్శించారు. భీమవరం మండలంలో పేదలకు వెయ్యి ఎకరాల భూమి పంపిణీ చేశామన్నారు.  తోపుడు బండ్ల వర్తకులకు హాకర్లజోన్‌ ఏర్పాటుచేయడమేగాక, భీమవరం నుంచి తరలిపోతున్న కస్తూరిబా మహిళ ప్రభుత్వ కళాశాలను నిలుపుదల చేయడానికి రూ.2 కోట్లు విలువచేసే సొంత ఆస్తిని విరాళంగా ఇచ్చిన విషయాన్ని శ్రీనివాస్‌ గుర్తు చేశారు. తాను భీమవరం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా పనిచేసిన రోజుల్లో బ్యాంకును ఎంతో అభివృద్ధి చేసి సుమారు రూ.100 కోట్ల డిపాజిట్లు సేకరించడమేగాక దానిలో రూ.60 కోట్ల వరకు రుణాలుగా ఇచ్చామని చెప్పారు.

అయితే దీనిలో అవకతవకలు జరిగాయని పవన్‌ ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్నేహితుడు కృషిబ్యాంకు వెంకటేశ్వరరావు కారణంగా అప్పట్లో అనేక సహకారం బ్యాంకులు సంక్షోభంలో కూరుకుపోయాయన్నారు. అయినా  డిపాజిట్‌దారులకు దాదాపు 98 శాతం తిరిగి తాము చెల్లించామని శ్రీనివాస్‌ తెలిపారు. తాను డిపాజిట్‌దారులకు అన్యాయంచేసి ఉంటే 2004 ఎన్నికల్లో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించేవారుకాదని, అలాగే 2014 ఎన్నికల్లో 74 వేల మంది ఓట్లు వేసే అవకాశం లేదని, దీనిని పవన్‌ గుర్తించాలన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో  వైఎస్సార్‌ సీపీ గట్టిపోటీ ఇస్తున్నందున తనపై అసత్య ఆరోపణలు చేయడం పవన్‌కు తగదని శ్రీనివాస్‌ హితవు పలికారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top