‘భోగాపురం’లో గ్లోబల్‌ స్కాం!

Global Scam in Bhagapuram International Airport bid - Sakshi

ఎయిర్‌పోర్టుకు మళ్లీ టెండర్‌ నోటిఫికేషన్‌ ముడుపుల కోసమేనా?

గ్లోబల్‌ టెండర్లలో బిడ్ల దాఖలుకు ఇవ్వాల్సిన కనీస సమయం 45 రోజులు

భోగాపురంలో తాజాగా బిడ్ల దాఖలుకు కేవలం 8 రోజులే వ్యవధి

గతంలో ప్రతిపాదనల నుంచి బిడ్ల దాఖలుకు 13 నెలల సుదీర్ఘ సమయం

కేంద్ర సంస్థతో ‘ప్రయోజనం’ ఉండదనే పాత టెండర్లు రద్దు

అత్యధిక రెవెన్యూ వాటా ఇస్తామన్న ‘ఏఏఐ’కి మొండిచెయ్యి

సాక్షి, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ టెండర్లలో గ్లోబల్‌ స్కాంకు తెరలేచింది! భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను బిడ్‌లో దక్కించుకుని అత్యధిక రెవెన్యూ వాటా ఇచ్చేందుకు ఎయిర్‌పోర్ట్స్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ముందుకొచ్చినా ఆ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ముడుపులు, కమీషన్లు రావనే ‘ముఖ్య’నేత ఈ టెండర్లను రద్దు చేసినట్లు అధికార వర్గాలు బహిరంగంగానే పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఈ నెల 17వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించింది.

ఎక్కువ మంది పాల్గొనకుండా...!
ప్రైవేట్‌ సంస్థకు అది కూడా ‘ముఖ్య’నేతకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూర్చేవారికే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు పనులను అప్పగించాలనే రాష్ట్ర సర్కారు ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని  ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా నిర్ణయించుకున్న ప్రైవేట్‌ సంస్థకు పనులు అప్పగించేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్ల నిబంధనలకు పాతర వేశారని పేర్కొన్నారు.

గ్లోబల్‌ టెండర్ల దాఖలుకు కనీసం 45 రోజులు సమయం ఇవ్వాలి. అయితే భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో ఈ నిబంధనను పట్టించుకోకుండా ఆసక్తి వ్యక్తీకరణకు 10 రోజులు, బిడ్ల దాఖలుకు 8 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం గమనార్హం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనకుండా కావాల్సిన వారికి మాత్రమే అవకాశం కల్పించేందుకే హడావుడిగా ముగిస్తున్నారని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
ఏఏఐ అత్యధికంగా

రెవెన్యూ వాటా ఇస్తామన్నా...
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల దగ్గర నుంచి బిడ్ల దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏకంగా 13 నెలలు సమయాన్ని ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్స్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియాతో పాటు, జీఎంఆర్‌ అప్పుడు బిడ్లు దాఖలు చేశాయి. 2016 జూన్‌లో ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించి 2017 జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ వచ్చారు.

అనంతరం జీఎంఆర్, ఏఏఐ బిడ్లు సక్రమంగా ఉన్నాయని తేల్చారు. ఏఏఐ అత్యధికంగా 30.2 శాతం రెవెన్యూ వాటాతో పాటు 26 శాతం ఈక్విటీ ఇస్తానందని, ఎకరానికి ఏటా రూ.20 వేల లీజు చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. జీఎంఆర్‌ కేవలం 21.6 శాతం మాత్రమే రెవెన్యూ వాటా ఇస్తానందని, ఈ నేపథ్యంలో ఏఏఐకి పనులు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

అయితే ఏఏఐకి ఎయిర్‌పోర్టు పనులు అప్పగించేందుకు ఇష్టం లేని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏరో సిటీ, ఏవియేషన్‌ అకాడమీ లాంటి అదనపు పనులు చేపట్టాలనే సాకుతో గత డిసెంబర్‌ 20వ తేదీన టెండర్ల రద్దుకు ఆదేశించింది. అనంతరం ఈ ఏడాది జనవరి 20వ తేదీన భోగాపురం విమానాశ్రయం టెండర్లను రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

పునరాలోచనకు నిరాకరణ
అయితే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఆ అదనపు పనులు కూడా తామే చేపడతామని, బిడ్ల దాఖలు గడువును పొడిగించాలని ఏఏఐ కోరినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్‌  సూచించినప్పటికీ  రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోకుండా టెండర్లను రద్దు చేస్తూ మళ్లీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  తాజాగా కొత్త టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను సమర్పించాలని పేర్కొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top