రాష్ట్రపతి డెడ్ లైన్ కు అసెంబ్లీ కట్టుబడి ఉంటుంది: ఆజాద్
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ధేశించిన గడువులోపే తెలంగాణ ముసాయిదా బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పంపుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాబ్ నబీ ఆజాద్ ఆశాభావం
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ధేశించిన గడువులోపే తెలంగాణ ముసాయిదా బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పంపుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాబ్ నబీ ఆజాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మరోసారి ఆజాద్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఇచ్చిన 40 రోజుల గడువు సమీపిస్తోందని.. ఆ గడువులోపే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును పాస్ చేయాల్సివుంటుందన్నారు.
భారత ప్రభుత్వం, రాష్ట్రపతి పెట్టిన డెడ్ లైన్ లోపే బిల్లును అసెంబ్లీ పాస్ చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2013ను జనవరి 23 తేదిలోపు తిరిగి పంపాలని రాష్ట్రపతి సూచించిన సంగతి తెలిసిందే. మెజార్టీ సభ్యులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ అభిప్రాయాన్ని కేంద్ర పరిగణనలోకి తీసుకుంటుందా అనే ప్రశ్నకు స్పందిస్తూ..పార్లమెంట్ తగిన నిర్ణయం తీసుకుంటుంది అని అన్నారు.