ఘోరం | four people died in road accident | Sakshi
Sakshi News home page

ఘోరం

Mar 10 2014 3:20 AM | Updated on Aug 30 2018 3:56 PM

‘అన్నా.. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోతివాన్నా.. ఇంక మాకు దిక్కెవరన్నా.. ఎప్పుడూ అందరినీ నవ్విస్తుంటివే..

కదిరి/నార్పల, న్యూస్‌లైన్: ‘అన్నా.. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోతివాన్నా.. ఇంక మాకు దిక్కెవరన్నా.. ఎప్పుడూ అందరినీ నవ్విస్తుంటివే.. ఒక్కసారి నవ్వు అన్నా..’ అని నార్పల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఆకుల జయసింహ మృతదేహంపై పడి ఆయన అనుచరులు ఏడుస్తుంటే చూపరులను సైతం కంటతడి పెట్టించింది. కదిరి ప్రభుత్వాస్పత్రి రోదనలతో మిన్నంటింది. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆకుల జయసింహ సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకెళితే.. రాష్ర్ట ప్రాథమిక విద్యాశాఖ మాజీ మంత్రి శైలజానాథ్ ప్రధాన అనుచరుడు బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి ఆదివారం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండలోని ఎర్రగుడి గంగమ్మ వద్ద ఇచ్చిన విందుకు మాజీ జెడ్పీటీసీ జయసింహ  తన అనుచరులతో హాజరయ్యారు. మార్గం మధ్యలో హార్సిలీహిల్స్‌ను సందర్శించి స్కార్పియోలో తిరుగుపయనమయ్యారు. ములకలచెరువు మండలం పెద్దపాళెం గ్రామం పెద్దేరు వంతెన సమీపంలో వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపుత ప్పి చింతచెట్టును ఢీకొంది.
 
 వాహనం నడుపుతున్న బండ్లపల్లి సాంబశివారెడ్డి (45)తోపాటు కత్తెర రామమోహన్ (45), గాండ్ల సుధాకర్ (40) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఆకుల జయసింహను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. మరో ఇద్దరు చిలమకూరి శ్రీనివాసులు, పురుషోత్తం పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రంధాలయ సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సిద్దారెడ్డి, కదిరి మాజీ మునిసిపల్ చైర్మన్ రమేష్‌రెడ్డి, ఆర్డీఓ రాజశేఖర్ తదితరులు కదిరి ప్రభుత్వాస్పత్రికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, అతని అనుచరులను ఓదార్చారు.
 
 ఆకుల జయసింహ కుటుంబ నేపథ్యం..
 ఆకుల జయసింహ తాత మాజీ ఎంపీపీ ఆకుల రామప్ప, వీరిది రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. జయసింహ తండ్రి ఆకుల శ్రీరాములు, మహానేత వైఎస్‌ఆర్, ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డితో సత్సంబంధాలున్నాయి. మహానేత ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ పార్టీలో చేరి జయసింహ నార్పల జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మాజీ మంత్రి శైలజానాథ్‌కు ఈయన ప్రధాన అనుచరుడు. జయసింహ భార్య నాగలలిత నార్పల మేజర్ పంచాయతీ సర్పంచుగా ఇటీవల అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. జయసింహ మర ణం వార్త తెలియగానే ఆయన తండ్రి శ్రీరాములు గుండెపోటుకు గురైనట్లు తెలిసింది. భార్య నాగలలిత, కార్యకర్తలు కన్నీరుమున్నీరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement