సీమలోనే రాజధాని ఉండాలి

సీమలోనే రాజధాని ఉండాలి


తిరుపతి కల్చరల్: శ్రీబాగ్ ఒడంబడిక మేరకు రాయలసీమలో రాజధాని ఏర్పా టు చేయడం ప్రభుత్వాల విధి అని దీనిని విస్మరిస్తే ప్రజా ఉద్యమం తప్పదని పలువురు వక్తలు హెచ్చరించారు. రాయలసీమ అధ్యయన సంస్థల అధ్యక్షుడు భూమన్ ఆధ్వర్యంలో తిరుపతిలోని గీతం స్కూల్లో ఆదివారం ‘రాయలసీమలోనే రాజధాని’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ముఖ్య అతిథిగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 1953 నుంచి రాజధాని విషయంలో తీవ్రంగా నష్టపోతున్నది సీమ వాసులేనన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోవడం మొదలు నేటి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వరకు సీమ ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ఏర్పాటుకు ప్రత్యేక కమిటీ వేసిన ప్రభుత్వం ఆ నివేదిక రాకమునుపే గుంటూరు, విజయవాడ రాజధానులంటూ లీకులు ఇవ్వడం విడ్డూరమన్నారు. రాయలసీమ అభివృద్ధి జరగాలంటే కర్నూలును రాజధాని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

 

 రాజధాని సాధనకు ఐక్య ఉద్యమాలు చేపట్టకతప్పని పరిస్థితి నెలకుంటోందన్నారు. రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు భూమన్ మాట్లాడుతూ సీమలో రాజధాని కోరడం ప్రతి తెలుగువాడి హక్కు అన్నారు. రాజధాని ఏర్పాటులో భిన్నస్వరాలు వినపించడం భావ్యం కాదన్నారు. ఐక్యతతో ఉద్యమించినప్పుడే సీమలో రాజధాని సాధ్యమవుతుందని సూచించారు. ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూల్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఉద్యమం రాజకీయ స్వార్థపరుల కారణంగా నీరుగారిపోయిందన్నారు. కనీసం సీమలో రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచే సీమలో రాజధాని సాధన ఉద్యమం బలోపేతం కావాలని సూచించారు. రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

 

 నేడు రాజధాని విషయంలో కూడా సీమ వాసులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. గీతం స్కూల్ కరస్పాండెంట్ తమ్మినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ రాయలసీమపై స్పష్టమైన నివేదిక ఇచ్చినా దీనిపై తిరిగి కమిటీల పేరుతో పాలకులు కాల యాపన చేయడం దారుణమన్నారు. మరో ఉద్యమంతో పాలకులకు గుణపాఠం చెప్పి సీమలో రాజధాని సాధించాల్సిన అవసరం ఉందన్నా రు. రిటైర్డ్ ఐజీ హనుమంతరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు చట్టబద్ధతతో కర్నూలును రాజధాని చేశారన్నారు. దీనిని విస్మరించి ఇప్పుడు గుంటూరు, విజయవాడ రాజధానులకు అనుకూలమని పాలకులు చెప్పడం శోచనీయమన్నారు. సీమలో రాజధాని కోసం బలోపేతమైన ఉద్యమం అవసరమన్నారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జయరామిరెడ్డి, రిటైర్డ్ ఎంఈవో బాలాజి, వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం నాయకురాలు కుసుమ, రాయలసీమ ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథశర్మ, సీనియర్ జర్నలిస్టు రాఘవశర్మ ఈ కార్యక్రమంలో పాల్గొని  ప్రసంగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top