అమ్మ ఊరికి రోడ్డేయలేనోడు.. అభివృద్ధికి బాటలు వేస్తాడా! 

The Former MLA Of Dharmavaram Did Not Develop To His Mothers Homeland - Sakshi

డి.చెర్లోపల్లి రోడ్డు అస్తవ్యస్తం 

ఇది మాజీ ఎమ్మెల్యే సూరి తల్లి సొంతూరు 

బస్సు సౌకర్యం లేక అవస్థలు 

ఆటోలతో జేబులకు చిల్లు 

రాత్రిళ్లు నరకం చూస్తున్న గ్రామస్తులు 

బాలికల ఉన్నత చదువులకూ ఇక్కట్లే 

ఐదేళ్లు ఎమ్మెల్యే.. కోట్లాది రూపాయల కాంట్రాక్టులు.. సొంత నిర్మాణ సంస్థ.. ఈ నేత నియోజకవర్గంలోని గ్రామమే డి.చెర్లోపల్లి. ఇది సూరి తల్లి నారమ్మ పుట్టినిల్లు. కనీసం ఆయన శాసనసభ్యునిగా ఉన్న కాలంలో ఈ గ్రామానికి రోడ్డు కూడా వేయించకపోవడం చూస్తే పాలన ఎంత దయనీయంగా సాగిందో అర్థమవుతోంది. అమ్మకు అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడంట – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ నేతలను ఉద్దేశించి తరచూ చెప్పే ఈ మాటలు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి సరిగ్గా అతుకుతాయి.. 

సాక్షి, బత్తలపల్లి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల మండలంలోని పత్యాపురం గ్రామంలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన డి.చెర్లోపల్లి రహదారి మీదుగానే వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి కాని అర్థం కాలేదు.. ఆయన హయాంలో నేతలు ఏస్థాయిలో అభివృద్ధి చేశారో. కనీసం నడిచేందుకు కూడా వీలు లేని రోడ్డును చూసి బాబు వెంట వచ్చిన పార్టీ నేతలు కూడా మనసులోనే ఇందుకోసమే ఓడిపోయామా అని బాధపడినట్లు కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఐదేళ్లు పెంచి పోషించిన పార్టీని కాదని, నమ్ముకున్న ప్రజలను.. కార్యకర్తలను నట్టేట్లో ముంచి ఆయన తన సొంత వ్యాపారాలను చక్కదిద్దుకునే పనిలో భాగంగా ఇటీవల బీజేపీలో చేరిపోవడం తెలిసిందే.

నియోజకవర్గంలోనే ఆయన తన సొంత నిర్మాణ సంస్థ నితిన్‌సాయి ఆధ్వర్యంలో ఎన్నో పనులు చేపట్టారు. ఈ పనుల్లో ఎక్కడా నాణ్యత లేకపోవడంతో విజిలెన్స్‌ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించారు. ఇదే పరిస్థితి ఉంటే లాభం లేదనుకున్న ఆయన.. ఎంచక్కా కమలం గూటికి చేరిపోయారు. ఇప్పుడు మేల్కొన్న ఆ పార్టీ వర్గీయులు ఆయన హయాంలో సొంత తల్లి ఊరికి రోడ్డును కూడా వేయించుకోలేకపోయాడని  సామాజిక మధ్యమాల్లోనూ ఎండగడుతున్నారు. ఎవరికైనా అవకాశం వస్తే.. సొంత ఊరికి, నమ్ముకున్న వాళ్లకు అంతోఇంతో మేలు చేయాలనుకుంటారు. కానీ ఈయన ప్రజల బాగోగులను గాలికొదిలేసి సొంతింటిని చక్కబెట్టుకోవడం ఎన్నికల్లో ఓటమి పాలుచేసింది. 

ఆటోలే దిక్కు 
డి.చెర్లోపల్లి గ్రామం నియోజకవర్గ కేంద్రం ధర్మవరానికి 29, మండల కేంద్రం బత్తలపల్లికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ కారణంగా బస్సు రద్దు కావడంతో గ్రామస్తులకు ఇప్పుడు ఆటోలే దిక్కయ్యాయి. బత్తలపల్లి నుంచి రూ.20, పత్యాపురానికి రూ.25లు వెచ్చించాల్సి వస్తోంది. ఇక విద్యార్థులు చదువుకునేందుకు 5 కిలోమీటర్ల నల్లబోయినపల్లికి వెళ్లక తప్పని పరిస్థితి. వీరంతా కాలినడకన వెళ్లి రావాల్సి ఉండటం గమనార్హం. అత్యవసర సమయాల్లో గ్రామస్తులు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం. వర్షాకాలంలో ప్రయాణం దుర్భరంగా ఉంటోంది. 

రాత్రిళ్లు నరకం 
సాయంత్రం ఆరు గంటలు దాటితే ఆటోలు కూడా తిరగవు. ఇక రాత్రిళ్లు అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి చేరుకునేందుకు నరకం చూడాల్సిందే. ఇలా రాత్రిళ్లు గుండెపోటు వచ్చిన వాళ్లు నలుగురు మృత్యువాత పడ్డారు. ఇప్పటికైనా మా గ్రామంపై దృష్టి సారించాలి.        – డి.వెంగమనాయుడు, డి.చెర్లోపల్లి, బత్తలపల్లి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top