విజయనగరంలో కరోనా తొలి మరణం! 

First Coronavirus Deceased In Vizianagaram District - Sakshi

సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో కరోనా వల్ల తొలి మరణం సంభవించింది. బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ నెల 4వ తేదీన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్‌కు, అక్కడి నుంచి టీబీ ఆస్పత్రికి వెళ్లారు. ఆమెకు అక్కడ కోవిడ్‌ 19 నిర్థారణ పరీక్ష చేయగా పాజిటివ్‌గా వచ్చింది. ప్రస్తుతం విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌ లాల్‌ వెల్లడించారు.

మొన్నటివరకూ రాష్ట్రంలోనే ఏకైక గ్రీన్‌ జోన్‌ జిల్లాగా ఉన్న విజయనగరంలో తొలి కరోనా కేసు బయటపడటం... రెండు రోజులకే తొలి మరణం చోటు చేసుకోవడంతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. చనిపోయిన మహిళకు నేరుగా 51 మంది, పరోక్షంగా 21 మందితో సంబంధాలు కలిగినట్లు అధికారులు ఇప్పటికే తేల్చారు. వీరందరినీ క్వా రంటైన్‌ సెంటర్లకు తరలించారు. గ్రామం చుట్టుపక్కల పది బఫర్‌ జోన్లలో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కాగా శనివారం నాటికి విజయనగరం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కలిగిన వారు ముగ్గురు ఉన్నారు. వీరికి మిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

నిబంధనలు మరింత కఠినం 
జిల్లాలో నిబంధనలు మరింత కఠినతరం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆదివారం నుంచి జిల్లాలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతినివ్వాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులందరికీ కోవిడ్‌ 19 నిర్థారణ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. మరోవైపు కరోనా వైరస్‌ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం సహాయక చర్యలు ఆందిస్తున్నారు.

కంటైన్మెంట్‌జోన్, చుట్టుపక్కల బఫర్‌జోన్‌లో ఉన్న 10 గ్రామాలకు రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. కంటైన్మెంట్‌జోన్‌లో ఉన్నవారిని ఇళ్లలోనుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి ఇతరుల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తూ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో 175 కుటుంబాలకు 5 కిలోల వంతున బియ్యం, పాలు ఇంటింటికి ఆందజేశారు. 

ఇంటింటా ముమ్మర సర్వే 
కరోనా వ్యాధి లక్షణాలైన దగ్గు, జ్వరం, జలుబు, గొంతునొప్పి తదితర సమస్యలతో బాధ పడుతున్న వారి వివరాలను వైద్యాధికారి నేతృత్వంలో ఆశ, ఏఎన్‌ఎం, వలంటీర్‌తో కూడిన 3 బృందాలు 160 ఇళ్లకు వెళ్లి సర్వే చేసి గ్రామస్తులకు తగిన సూచనలు అందిస్తున్నారు. ఇప్పటికే ఎస్పీ, బీసీ కాలనీల్లో సర్వే పూర్తి చేశారు. బఫర్‌ జోన్‌లో ఉన్న గ్రామాల్లో కూడా సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతీ ఇంటికీ వెళ్లి మాస్కులను పంపిణీ చేశారు.

కరోనా ఒకరినుంచి ఒకరికి వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆ ప్రాంతంలో సబ్‌ కలెక్టర్‌ టి.ఎస్‌.చేతన్, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, పంచాయతీ, వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖల అధికారులు గ్రామంలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. కంటైన్మెంట్‌ ప్రాంతంలో పూర్తిగా సోడియం హైపో క్లోరైట్‌ పిచికారీ చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top