ధర్మవరపు కన్నుమూత

ధర్మవరపు కన్నుమూత


సాక్షి, హైదరాబాద్/ఒంగోలు: ‘మాక్కూడా తెలుసు బాబూ..’ వంటి మాటల విరుపులు, విలక్షణ నటనతో అశేష తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(59) ఇక లేరు. ఆరు నెలలుగా కాలేయ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి 10.30 గంటలకు ఇక్కడి చైతన్యపురిలోని గీతా ఆస్పత్రిలో మృతిచెందారు. పరిస్థితి విషమించడంతో నాలుగు రోజుల కింద ట ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆయనకు భార్య కృష్ణజ, ఇద్దరు కుమారులు రోహన్ సందీప్, రవిబ్రహ్మతేజ ఉన్నారు. సందీప్ వివాహితుడు కాగా, రవిబ్రహ్మతేజ డిగ్రీ చదువుతున్నారు. ధర్మవరపు కుటుంబం  దిల్‌సుఖ్‌నగర్‌లోని శారదానగర్‌లో నివాసం ఉంటోంది. ఆయన పార్థివ దేహాన్ని ఇంటివద్ద ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం అద్దంకి దగ్గర్లోని శింగరకొండ  దేవాలయం వద్ద ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌లోనే అంత్యక్రియలు నిర్వహిస్తారు. దర్శకుడు తేజ..   ధర్మవరపు భౌతికకాయాన్ని సందర్శించారు.


 


 ఆనందోబ్రహ్మతో: ధర్మవరపు సుబ్రహ్మణ్యం 1954 సెప్టెంబర్ 20న ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో జన్మించారు. ఒంగోలులోని సీఎస్‌ఆర్ కళాశాలలో పీయూసీ వరకు చదివారు. అలా చదువుతున్న రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లుతో ఏర్పడింది. ‘గాలివాన’ నాటకంలోని జగన్ పాత్రతో ధర్మవరపు 18 ఏళ్ల వయసులోనే నటనలో సత్తా చాటారు. తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ ఉద్యోగానికి ఎంపికైన ఆయన హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో దూరదర్శన్‌లో ‘ఆనందో బ్రహ్మ’ సీరియల్‌లో నటించి గుర్తింపు పొందారు. తర్వాత ఎన్నో టీవీ సీరియళ్లలో నటించారు. ఎమ్మెల్యేలకు నిర్వహించే క్రీడాపోటీలకు వ్యాఖ్యానం చెప్పే అవకాశం కూడా ఆయనకు లభించింది.


 


 ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో తెరంగేట్రం..


 


 జంధ్యాల చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో ధర్మవరపు తెరంగేంట్ర చేశారు. ‘నువ్వు-నేను’ తదితర చిత్రాలు ఆయనకు పేరు తెచ్చాయి. ఆయన నరేష్ నటించిన ‘తోకలేనిపిట్ట’ చిత్రానికి దర్శకత్వం వహించారు. హాస్యంతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన కొన్నేళ్లుగా సాక్షి టీవీలో నిర్వహిస్తున్న రాజకీయ వ్యంగ్య కార్యక్రమం ‘డింగ్‌డాంగ్’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ధర్మవరకు రాష్ట్ర సాంస్కృతికమండలి చైర్మన్‌గా పనిచేశారు. ‘ఆలస్యం అమృతం’కు ఉత్తమ కమెడియన్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్మవరపు కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్‌గా కళారంగ వికాసానికి కృషి చేశారు. ఆయన నటించిన ‘ప్రేమాగీమా జాంతానై’ విడుదల కావాల్సి ఉంది. అప్పటికే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వికారాబాద్‌లో జరిగిన షూటింగ్‌కు హాజరై తమకెంతో సహకరించారని చిత్ర దర్శకుడు ఆర్‌వీ సుబ్బు తెలిపారు. ధర్మవరపు మరణంపై రాష్ట్ర బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు సంతాపం తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top