
మంత్రి సోమిరెడ్డిని నిలదీస్తున్న రైతులు
నెల్లూరు(అర్బన్): రైతు రుణమాఫీని గొప్పగా అమలు చేశామని చెప్పుకుంటున్న వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సొంత జిల్లా రైతులే షాక్ ఇచ్చారు. రుణాలు ఎక్కడ మాఫీ చేశారో చెప్పాలంటూ నిలదీశారు. దీంతో ఖంగుతిన్న మంత్రి.. పేర్ల నమోదులో సాంకేతిక లోపాలు తలెత్తాయని చెప్పి, అక్కడ్నుంచి బయటపడ్డారు. రుణ మాఫీ అందని రైతుల కోసం శనివారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. మంత్రి సోమిరెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమానికి అధికారులు ఊహించిన దానికంటే వేలాది సంఖ్యలో రైతులు తరలివచ్చారు.
అర్హత ఉన్నా తమకు రుణమాఫీ అందలేదని ఫిర్యాదులు చేశారు. వందలాది మంది రైతులు మంత్రి సోమిరెడ్డి వద్దకు చేరుకుని రుణమాఫీ తీరుపై నిలదీశారు. రెండో విడతలో రుణమాఫీ బాండ్లు ఇస్తున్నట్లు చెప్పారని, కానీ వాటిని తమకెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతుల ప్రశ్నల దాడి నుంచి తప్పించుకునేందుకు.. పేర్ల నమోదులో సాంకేతిక లోపాలు తలెత్తాయని, సమస్యను వెంటనే పరిష్కరిస్తామంటూ మంత్రి అక్కడ్నుంచి బయటపడ్డారు.