వ్యవసాయ విద్యుత్ కోతపై అన్నదాతలు ఆగ్రహించారు. శుక్రవారం కరేడు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. మాచవరంలోనూ సబ్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై రాస్తారోకో చేశారు.
ఉలవపాడు, న్యూస్‌లైన్ : వ్యవసాయ విద్యుత్ కోతపై అన్నదాతలు ఆగ్రహించారు. శుక్రవారం కరేడు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. మాచవరంలోనూ సబ్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై రాస్తారోకో చేశారు. విద్యుత్ కోతల వల్ల పంటలకు నీరందక ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరేడుకు చెందిన 300 మంది రైతులు తమకు రోజుకు నాలుగు గంటలు కూడా వ్యవసాయ విద్యుత్ సరఫరా కావడం లేదంటూ కరేడులోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సబ్‌స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించారు.
వ్యవసాయ విద్యుత్ కోతల కారణంగా కరేడు గ్రామంలో సాగుచేసిన వేరుశనగ, వరి, రాగి, చవక, జామాయిల్ నార్లు నీరందక ఎండిపోతున్నాయని వాపోయారు. రోజుకు ఏడు గంటల పాటు వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, కనీసం నాలుగు గంటలు కూడా సరఫరా చేయడం లేదని అధికారులపై మండిపడ్డారు. రైతులకు సరఫరా చేయాల్సిన విద్యుత్‌ను ఆక్వా చెరువులకు మళ్లిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
అదేవిధంగా లైన్‌మన్ అందుబాటులో లేకుండా ఇబ్బందిపెడుతున్నాడన్నారు. తమ గ్రామంలో వరి, వేరుశనగ, రాగి పంటలు వెన్నుకాయ దశలో ఉన్నాయని, మరో నెలరోజుల పాటు విద్యుత్ సరఫరా సక్రమంగా ఉంటే పంట చేతికొస్తుందని, లేకుంటే వరిసాగు చేసిన రైతులు ఎకరాకు 20 వేలు, వేరుశనగ రైతులు 30 వేలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా చెరువులకు అన్ని వేళల్లో విద్యుత్ సరఫరా ఏ విధంగా చేస్తున్నారంటూ ఏడీఈ వీరయ్యను చుట్టుముట్టి నిలదీశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా కనీసం నాలుగు గంటలైనా విద్యుత్ సరఫరా చేయకుంటే ఒప్పుకునేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.
విద్యుత్ అధికారుల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై షేక్ నసీబ్‌బాషా సిబ్బందితో వచ్చి రైతులతో మాట్లాడారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చి వెళ్లిపోవాలంటూ రైతులతో చర్చించారు. చివరకు తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 11 గంటల వరకుగానీ, రాత్రి 10 నుంచి 12 గంటల వరకుగానీ వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నారు.
మాచవరంలో...
మాచవరం (కందుకూరు రూరల్), న్యూస్‌లైన్ : వ్యవసాయ విద్యుత్ కోతలు అధికమవడంతో వరిపైరు ఎండిపోతోందని ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. వేళాపాళాలేని విద్యుత్ సరఫరా వల్ల పొలాల్లో జాగారం చేయలేక మండలంలోని మాచవరం రైతులు స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట శుక్రవారం రాస్తారోకోకు దిగారు. కందుకూరు-గుడ్లూరు రోడ్డుపై బైఠాయించి సుమారు గంటకుపైగా వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
వ్యవసాయ విద్యుత్‌ను రోజుకు కనీసం గంట కూడా సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఒక్క నిమిషం కూడా కరెంటు ఇవ్వలేదని, సబ్‌స్టేషన్ సిబ్బందికి ఫోన్ చేస్తే సక్రమంగా సమాధానం చెప్పడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు విన్న రూరల్ ఏఈ ఆర్.సునీల్‌కుమార్ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా సక్రమంగా లేనందున తామూ సరైన సమయాలు చెప్పలేకపోతున్నామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఏఈ హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.