రణజ్వాల.. గురజాల

The Fake killing Are Engaged In Education And Business, Showing Political Consciousness - Sakshi

సాక్షి, గురజాల : చాపకూటి సిద్ధాంతంలాంటి సమానత్వాన్ని చాటుకున్న చోటే.. ఫ్యాక్షన్‌ రక్తపు మరకల్లో తడిచి ముద్దయిన ప్రాంతం పల్నాడు. నాయకురాలు నాగమ్మ పౌరుషాలను పుణికిపుచ్చుకుని.. బ్రహ్మనాయుడు వంటి సౌమ్య గుణాన్ని కలిగిన ఈ ప్రాంతంలో గురజాల నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నాగార్జున సాగర్‌ జలాలతో సిరుల పంటలిచ్చిన భూములు.. ఐదేళ్లలో కాలంలో మళ్లీ బీడువారాయి. ఫ్యాక్షన్‌ హత్యలను పక్కన పెట్టి విద్యా, వ్యాపారాల్లో ముద్ర వేస్తున్న ఈ ప్రాంత ప్రజలు రాజకీయ చైతన్యం చూపిస్తున్నారు.పల్నాడు ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. బాలచంద్రుడు, కన్నమదాసు, నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు ఆ రోజుల్లోనే చాపకూటి సిద్ధాంతాన్ని అమలు చేసి సమానత్వాన్ని చాటారు. తరువాత కాలనుగుణంగా పల్నాడు ప్రాంతం కక్ష్యలు, కార్పణ్యాలతో రగిలిపోయింది. అనంతరం గ్రామాల్లో అక్షరాస్యత శాతం పెరగడంతో ప్రశాంత వాతావరణం నెలకొని శాంతి కపోతాలు ఎగురుతున్నాయి. 

గురజాల విశిష్టత 
గురజాల మండలం పులిపాడు, దైద, తేలుకుట్ల గ్రామాల్లో ఫ్యాక్షన్‌ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామాలు ఫ్యాక్షన్‌ విడిచిపెట్టి వ్యాపారాలపై మక్కువ చూపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉంది. వరి, పత్తి, మిరప పంటలు సాగవుతున్నాయి. నాగార్జున సాగర్‌ నుంచి కాలువలకు నీరు రాకపోవడంతో వరి సాగు తగ్గి పత్తి, మిరప వైపు రైతాంగం మళ్లింది. ప్రస్తుతం బోర్లు, చెరువులు కింద మాత్రమే వరి సాగవుతోంది.  నాగార్జున సాగర్‌ రాకముందు ఈ ప్రాంతం బీడుగా మారింది. 1967లో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి నుంచి పలనాట సిరుల పంటలు పండుతున్నాయి.   

ఎన్నికల విజేతలు
1952లో కాసు బ్రహ్మానందరెడ్డి (కాంగ్రెస్‌)పై కోలా సుబ్బారెడ్డి(సీపీఐ) 11,673 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1955లో కోలా సుబ్బారెడ్డి (సీపీఐ)పై మండవ బాపయ్య చౌదరి (కేఎల్‌పీ) 6,907 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1962లో కోలా సుబ్బారెడ్డి(సీపీఐ)పై కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్‌) 4,624 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

1967లో గడిపూడి మల్లికార్జునరావు(ఇండిపెండెంట్‌)పై కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్‌) 7,167 ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నారు. 1972లో కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్‌)పై మందపాటి నాగిరెడ్డి (సీపీఐ) 8,377 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1978లో మందపాటి నాగిరెడ్డి(సీపీఐ)పై గడిపూడి మల్లికార్జునరావు(కాంగ్రెస్‌) 23,248 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

1983లో కాసు వెంకట కృష్ణారెడ్డి(కాంగ్రెస్‌)పై జూలకంటి నాగిరెడ్డి (ఇండిపెండెంట్‌) 12,722 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1985లో కాయితి వెంకట నర్సిరెడ్డి(కాంగ్రెస్‌)పై అంకిరెడ్డి ముత్యం (టీడీపీ) 3,603 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1989లో రాచమడుగు సాంబశివరావు (టీడీపీ)పై కాయితీ వెంకట నర్సిరెడ్డి(కాంగ్రెస్‌) 8,145 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1994లో కనకం రమేష్‌ చంద్రదత్తుపై యరపతినేని శ్రీనివాసరావు 23,967 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

1999లో యరపతినేని శ్రీనివాసరావుపై      జంగా కృష్ణమూర్తి 131 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2004లో యరపతినేని శ్రీనివాసరావుపై జంగా కృష్ణమూర్తి 7,126 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2009లో ఆలా వెంకటేశ్వర్లుపై యరపతినేని శ్రీనివాసరావు 10,565 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014లో జంగా కృష్ణమూర్తిపై యరపతినేని శ్రీనివాసరావు 7,896 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 

మార్పు– కూర్పు 
పునర్విభజన కాక ముందు గురజాల నియోజకవర్గంలో 5 మండలాలు ఉండేవి (గురజాల, రెంటచింతల, మాచవరం, దాచేపల్లి, పిడుగురాళ్ల)  మండలాలు కలిసి ఉండేవి. రెంటచింతల మండలాన్ని మాచర్ల నియోజకవర్గంలో కలిపారు.  

విద్యా రంగం 
గురజాల మండల పరిధిలోని జంగమహేశ్వరపురం వద్ద ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల ఉంది. ఇంటర్మీడియెట్‌ కళాశాలతోపాటు ప్రైవేట్‌ కళాశాలలు–2, డిగ్రీ కళాశాల ఒకటి కలవు. బీఎడ్, బీఈడీ ప్రైవేట్‌ ళాశాలలు ఉన్నాయి. దాచేపల్లి మండలంలో ఇంటర్మీడియెట్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి.

వైఎస్‌ హయాంలో..
గురజాల మండలం మాడుగుల–శ్యామరాజుపురం గ్రామాల మధ్య బుగ్గవాగు రిజర్వాయర్‌ నుంచి పలు గ్రామాలకు మంచినీటిని అందించాలనే లక్ష్యంతో పైపు లైన్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ పథకం కింద వేల ఎకరాల వరి పంటలు సాగవుతున్నాయి. దాచేపల్లిలోని దండివాగు ఎత్తిపోతల పథకానికి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించారు. శ్రీనగర్‌లో రూ.1.50 కోట్ల వ్యయంతో సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. శ్రీనగర్‌ నుంచి దాచేపల్లికి మంచినీటి ఇరిగేషన్‌ ఏర్పాటు చేసి అనేక గ్రామాల దాహార్తి తీర్చారు. పొందుగుల–దాచేపల్లికి వాటర్‌ పైప్‌లైన్‌ నిర్మించి ప్రతి ఇంటికి కృష్ణా జలాలను అందించారు. మాచవరం మండలంలోని మోర్జంపాడు లిప్టు ఇరిగేషన్‌ ఏర్పాటు చేసి సుమారుగా 5 వేల ఎకరాలను సస్యశ్యామంలం చేశారు. పిడుగురాళ్ల పట్టణ ప్రజలకు గోవిందాపురం జలాలను అందించేందుకు రూ.37 కోట్ల నిధులతో పైపు లైన్లు నిర్మించారు. పిడుగురాళ్లలో ట్రాఫిక్‌ సమస్యలు అధిగమించేందుకు అద్దంకి–నార్కెట్‌పల్లి రహదారిని పట్టణం గుండా వెళ్లేలా చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top