
నకిలీ మద్యం గుట్టురట్టు
కర్నూలు/డోన్‌టౌన్: జిల్లాలో నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడే తయారు చేస్తున్న మద్యం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో బెల్టు షాపులకు తరలుతోంది.
కర్నూలు/డోన్‌టౌన్: జిల్లాలో నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడే తయారు చేస్తున్న మద్యం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో బెల్టు షాపులకు తరలుతోంది. జిల్లా పరిషత్ కీలక నేత ఒకరు ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే కర్ణాటక మద్యం జిల్లాలో ఏరులై పారుతుండగా.. ఇటీవల కాలంలో నకిలీ మద్యం జాడలు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.
ఆదివారం డోన్ మండలం కొత్తకోట గ్రామ సమీపంలోని మామిడితోట వద్ద రూ.11 లక్షల విలువ చేసే నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. గ్రామానికి సమీపంలోని రాఘవేంద్ర గార్డెన్స్‌లో భారీ మొత్తంలో నకి లీ మద్యం నిల్వ ఉంచినట్లు ప్యాపిలి సివిల్ పోలీసులకు సమాచారం అందడంతో ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌చార్జ్ డిప్యూటీ కమిషనర్‌కు విషయం తెలియజేశారు. ఆయన ఆదేశాలకు మేరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీఐ రాజశేఖరగౌడ్ నేతృత్వంలో సిబ్బంది దాడి చేసి 15,360 నకిలీ బ్యాగ్‌పైపర్ బాటిళ్లు, లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు.
బయటపడిందిలా..
ఉడుమలపాడుకు చెందిన ఓ వ్యక్తి డోన్ ప్రాంతంలో నకిలీ మద్యం రవాణా చేస్తుంటాడు. గత అక్టోబర్ 31న పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కనున్న రాజధాని డాబా, రాజ్ డాబా వద్ద నాగరాజు, హనుమంతు నుంచి 45 బాటిళ్ల కల్తీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలిన చందంగా వారిచ్చిన సమాచారంతో కొత్తకోట వద్ద భారీ డంప్ ఉన్నట్లు వెలుగుచూసింది.
అయినా స్థానిక ఎక్సైజ్ అధికారులు పట్టించకోకపోవడంతో అజ్ఞాత వ్యక్తులు మరోసారి ప్యాపిలి సివిల్ పోలీసుల ద్వారా జిల్లా ఎక్సైజ్ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో దాడులు చేసి నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో జిల్లా పరిషత్ ముఖ్య నేత పేరు వెలుగులోకి రావడంతో సమాచారాన్ని గోప్యంగా ఉంచారు.
డోన్‌లో లిక్కర్ డాన్
డోన్ మండల పరిషత్ కార్యాలయంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడు నకిలీ మద్యం డాన్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. డంప్ దొరికిన ప్రాంతం కూడా సదరు నాయకుడు గ్రామ సమీపానే ఉండడం ఇందుకు ఊతమిస్తుంది. జిల్లా పరిషత్ ముఖ్య నేతతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆయన డోన్ ప్రాంతంలో నకిలీ మద్యం వ్యాపారాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
మద్యం షాపుల్లో తగ్గిన అమ్మకాలు
నకిలీ మద్యం పల్లెల్లో ఏరులై పారుతున్న కారణంగా ప్రభుత్వ దుకాణాల్లో వ్యాపారం మందగించింది. రోజుకు రూ.లక్షల్లో జరిగే వ్యాపారం తగ్గిపోవడంతో లెసైన్స్‌దారులు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచితే నకిలీ మద్యం రవాణా వెనుక ఉన్న బడా నేతల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.