అగ్రిగోల్డ్‌ కంపెనీల టేకోవర్‌పై ఎస్సెల్‌ గ్రూప్‌ వెనక్కి

Essel group withdraws from AgriGold's takeover - Sakshi

ఆస్తులను మాత్రమే స్వాధీనం చేసుకుంటామని హైకోర్టుకు నివేదన

సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ గ్రూపు కంపెనీలతో పాటు మొత్తం ఆస్తులను టేకోవర్‌ చేస్తామని గతంలో చెప్పిన ఎస్సెల్‌ గ్రూపునకు చెందిన సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ ఇప్పుడు వెనక్కి తగ్గింది. కంపెనీలను కాకుండా తాము వాటి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని సోమవారం హైకోర్టుకు నివేదించింది. దీనిపై హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. టేకోవర్‌ కాకుండా కేవలం ఆస్తులను తీసుకుంటామనడం ఎంత వరకు సాధ్యమో చెప్పాలంది. ఆస్తులకు ఇంకా ఎక్కువ చెల్లిస్తామని ఎవరైనా ముందుకు వస్తే ఏం చేయాలని ప్రశ్నించింది.

ఇదే సమయంలో ఆస్తుల స్వాధీన ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను పూర్తి చేసేందుకు మూడు నెలల గడువు కావాలని ఎస్సెల్‌ గ్రూపు తరఫు సీనియర్‌ న్యాయవాది పి.శ్రీరఘురాం కోర్టును కోరారు. తాకట్టులో ఉన్న ఆస్తుల విషయంలో స్వీయ ఖర్చుతో ప్రకటనలు జారీ చేయడానికి అనుమతినివ్వాలని కూడా అభ్యర్థించారు. ఈ అభ్యర్థనలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని రాతపూర్వకంగా తమ ముందుంచాలని అటు పిటిషనర్, ఇటు రెండు రాష్ట్రాల సీఐడీ తరఫు న్యాయవాదులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top