పెట్టుబడిలేని సాగు పెద్ద దగా : వందనా శివ

Environmentalist Vandana Shiva Comments At AP Farmers Conference - Sakshi

కార్పొరేట్లు ఆడుతున్న నాటకంలో భాగమే ఈ సేద్యం

నూతన వ్యవసాయానికి జగన్‌ దిశానిర్దేశం చేయాలి

రాష్ట్ర రైతు సమ్మేళనంలో ప్రముఖ పర్యావరణ వేత్త వందనా శివ

సాక్షి, అమరావతి: పెట్టుబడి లేని వ్యవసాయం (జెడ్‌బీఎన్‌ఎఫ్‌) వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, రాష్ట్రంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిషేధించాలని ప్రముఖ పర్యావరణ వేత్త, రచయిత, సామాజిక కార్యకర్త డాక్టర్‌ వందనా శివ విజ్ఞప్తి చేశారు. పెట్టుబడి లేని వ్యవ సాయమనేది భారతదేశానికి కొత్తదేమీ కాదని, కొన్ని వేల ఏళ్ల కిందటి నుంచి ఉన్నదేనని వివరించారు. విత్తనంపైన, సాగుపైన గుత్తాధిపత్యాన్ని సాధిం చేందుకు కార్పొరేట్లు పన్నిన వలలో ఉద్దేశ పూర్వకంగానే చిక్కుకున్న కొందరు పెద్దలు ఈ విధానాన్ని తామేదో కొత్తగా కనిపెట్టినట్టు ప్రచారంచేయడాన్ని ఆమె ఖండించారు.

పెట్టుబడి లేని వ్యవసాయానికి ప్రపంచ బ్యాంకు నుంచి పిఎన్‌ ఫరబాస్‌ అనే కార్పొరేట్‌ సంస్థ నుంచి వందల కోట్ల రూపాయలు నిధులు ఎందుకు తెచ్చి విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం గుంటూరులో ఏర్పాటు చేసిన మూడు రోజుల రైతు సమ్మేళనంలో ఆమె ప్రసంగించారు. 2022 నాటికి రాష్ట్రంలో ప్రకృతి సాగు పేరిట అద్భుతాలు సృష్టిస్తామని చెప్పడంలో ఏ మాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పారు. 2022 నాటికి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయానికి కొత్త ఒరవడిని సృష్టించి దేశానికి దిక్చూచిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం జగన్‌ విధానాల వైపు దేశం వేచి చూస్తోందని చెబుతూ నవరత్నాలలో భాగంగా ప్రకటించిన వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రశంసించారు.  

రాష్ట్రంపై బహుళజాతి సంస్థల పంజా...
నక్కలాంటి బహుళజాతి విత్తన కంపెనీలు ఇప్పుడు ఆంధ్రాను ఆక్రమింపిజూస్తున్నాయని, వారి ఆటలు సాగకుండా చూసి రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత జగన్‌పై ఉందని వందనా శివ అన్నారు. మోన్‌శాంటో లాంటి సంస్థలపై పోరాడిన చరిత్ర ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకించి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఉందని గుర్తు చేశారు. సందర్భంగా ఆమె రైతు రక్షణ వేదిక ప్రచురించిన ’రైతుల విత్తన హక్కుపై కంపెనీల దాడి’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top