విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఉధృతం | Electricity employees' strike escalates | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఉధృతం

Sep 13 2013 1:37 AM | Updated on Sep 22 2018 8:07 PM

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగుల 72 గంటల సమ్మె జిల్లా వ్యాప్తంగా ఉద్ధృతంగా సాగుతోంది. తిరుపతిలో డిస్కం కార్యాలయం ఉద్యోగుల నినాదాలతో దద్దరిల్లింది.

సాక్షి, తిరుపతి: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగుల 72 గంటల సమ్మె జిల్లా వ్యాప్తంగా ఉద్ధృతంగా సాగుతోంది. తిరుపతిలో డిస్కం కార్యాలయం ఉద్యోగుల నినాదాలతో దద్దరిల్లింది. మదనపల్లె, చిత్తూరు, పుత్తూరు, శ్రీకాళహస్తి సబ్ డివిజన్లలో విద్యుత్ ఉద్యోగులు పూర్తి గా సమ్మెలో పాల్గొన్నారు. గురువారం ఉదయం నుంచే జిల్లాలోని వందలాది మంది విద్యుత్ ఉద్యోగులు కార్యాలయాలకు తాళాలు వేసి పెన్‌డౌన్, టూల్ డౌన్ చేసి రోడ్లపైకి వచ్చారు. సబ్ స్టేషన్లలో కేవలం కాంట్రాక్టు సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. తిరుపతి సర్కిల్‌లోని డీఈలు, ఏడీఈలు, అకౌంటెంట్లు, ఏఈలు, లై న్‌మన్లు సమ్మెలో పాల్గొంటున్నారు.

సీయూజీ కార్డులను  వెనక్కి ఇచ్చేశారు. అత్యవసర విద్యుత్ సేవలకు కాంట్రాక్టు ఉద్యోగులే హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 2,500 మంది ఉద్యోగులు సమ్మెకు దిగారు. కార్పొరేట్ కార్యాలయంలోని 400 మంది ఉద్యోగులు కూడా ధర్నా చేశారు. డిస్కం కార్యాలయ ప్రధాన గేటుకు తాళాలు వేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్పొరేట్ కార్యాలయం ఎదుట నిరసన కొనసాగింది. దీనికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ అశోక్‌కుమార్, కన్వీనర్ డీఈ మునిశంకరయ్య, కో-కన్వీనర్ చలపతి, ఏడీఈలు, అకౌంట్స్, కాస్టింగ్ అధికారులు, ఎస్టాబ్లిష్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.

 సమ్మెతో ఇక్కట్లు

 విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేసేందుకు తంటాలు పడుతున్నారు. జిల్లాకు ఒక టోల్ నెంబరు ఇచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు బ్రేక్ డౌన్ అయిన చోట్ల సమస్య పరిష్కరించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేవలం కాంట్రాక్టు ఉద్యోగులను ఉపయోగించి అన్ని పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కార్పొరేట్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు ఆరు జిల్లాల్లో ఎక్కడెక్కడ విద్యుత్ సరఫరా బ్రేక్ డౌన్ అయింది, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేయాలనేది నిరంతరం సమీక్షిస్తున్నారు. డీఈలు, ఏఈలను, లైన్‌మెన్లను సంప్రదించాలంటే సీయూజీ ఫోన్లు లేవు. కొత్తవారికి ధైర్యంగా పనులు అప్పగించలేకునాన్నారు.

 అత్యవసర సేవలకు మినహాయింపు

 జిల్లాలో రెగ్యులర్ విద్యుత్ ఉద్యోగులు టూల్‌డౌన్ చేసినా అత్యవసర సేవలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని జేఏసీ కన్వీనర్ మునిశంకరయ్య తెలిపారు. సమస్యలను కాంట్రాక్ట్ ఉద్యోగుల ద్వారా పరిష్కరిస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రకటించిన మేర కు 72 గంటల సమ్మె జరుగుతుందని, సమైక్య ప్రకటన రానిపక్షంలో దాన్ని నిరవధిక సమ్మెగా మార్చేం దుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement