ఎన్నికల విధులు  నిష్పక్షపాతంగా  నిర్వహించాలి

Electoral duties should be conducted objectively - Sakshi

సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి) : జిల్లాలో సాధారణ ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతిఒక్కరూ నిబద్ధత, నిష్పక్షపాతంగా ఉండాలని  కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం స్థానిక రామచంద్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎన్నికల సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓ, నోడల్‌ అధికారులు, సెక్టార్‌ అధికారులు, పోలీసు తదితర 1,500 ఎన్నిక సిబ్బంది ఎన్నికల ప్రవర్తనా నియామవళి, మార్గదర్శకాలపై పూర్తి స్పష్టత  ఉండాలన్నారు. ఇందుకు సంబంధిత అంశాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలని, అనుమానాలుంటే నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించాలన్నా రు. జిల్లాలో సాధారణ ఎన్నికల నిమిత్తం 20 నుంచి 25 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. జి ల్లాలో 30,57,922 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఏప్రిల్‌ 11న జరిగే పోలింగ్‌లో వినియోగించుకుంటారని  ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత అందరిపై ఉందన్నారు.

 
ఖర్చును నివేదించాలి
పార్లమెంటు స్థానానికి పోటీచేసే అభ్యర్థి రూ.70 లక్షలు, అసెంబ్లీ స్థానానికి పోటీచేసే అభ్యర్థి రూ.28 లక్షల వరకు ప్రచార, తదితర ఖర్చును పరిమితం చేసుకోవాల్సి 
ఉంటుందని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. వారి ప్రచార కార్యక్రమాల ఖర్చు, పత్రికలకు ప్రకటన రూపంలో చేసే ఖర్చు తదితర వివరాలను ఎప్పటికప్పుడూ నివేదించాలని ఆదేశించారు. అనుమతిలేని ఫ్లెక్సీలు, గోడ రాతలను పూర్తి తొలగించాలని, ఎక్కడైనా ప్రైవేట్‌ భవనాలపై అటువంటివి రాసి ఉంటే సంబంధిత యజమాని సమ్మతి ఉన్నదీ లేనిదీ పరిశీలించాలని సూచించారు. ఈ విడత ఎన్నికల సమయంలో కేంద్ర సాధారణ, వ్యయ పరిశీలకులు పెద్ద సంఖ్యలో రానున్నారని, వారు క్షేత్రస్థాయిలో చేసే తనిఖీల సమయంలో వెల్లడించే సందేహాలను, వివరాలను స్పష్టంగా సంబంధిత అధికారులు తెలియజేయాల్సి ఉంటుందని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. 

1,057 సమస్యాత్మక కేంద్రాలు
జిల్లాలో 3,411 పోలింగ్‌ కేంద్రాలుండగా వాటిలో 1,057 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని కలెక్టర్‌ అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్మ్‌డ్‌ పోలీసు విధులు నిర్వర్తిస్తారన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు, జీలు గుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తనిఖీల సమయంలో రూ.10 లక్షలకు పైన ఉంటే ఆదాయశాఖ పన్నుశాఖకు, అంతలోపు పట్టుబడితే జిల్లా ఎన్నికల అధికారికి అప్పగిస్తామన్నారు. ర్యాలీలు,  సభల నిర్వహణకు ముందస్తు అనుమతి తప్పనిసరని చెప్పారు.  మైక్, లౌడ్‌స్పీక్టర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలలోపు మాత్రమే అనుమతితో వినియోగించుకోవాలన్నారు. జేసీ ఎం.వేణుగోపాలరెడ్డి, ఎస్పీ ఎం.రవిప్రకాష్, డీఆర్‌ఓ ఎన్‌.సత్యనారాయణరెడ్డి, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ ప్రవీణ్‌ ఆదిత్య, అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు, ఐటీడీఏ పీఓ హరీంద్రప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top