తిరుమలకు వీఐపీలు ఉద్యమకారులను చెర్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, వీహెచ్ చేసిన వ్యాఖ్యల వల్లే ఉద్యమకారులు ఆవేశానికి గురయ్యారని అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు చెప్పారు.
అలిపిరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత వి.హనుమంతరావు కారుపై చెప్పులు పడిన సంఘటన మీద అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు స్పందించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోడానికి శనివారం తిరుమల వచ్చిన ఆయన.. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు ఉద్యోగాలు చేయటానికి అర్హులు కాదంటూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు నివసించవచ్చు కానీ... ఉద్యోగాలు చేయరాదంటూ వీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సమైక్యవాదులు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని అలిపిరి దిగువ ఘాట్ వద్ద అడ్డుకున్నారు.
ఈ సంఘటనపై అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు స్పందించారు. వీఐపీలు ఎవరు వచ్చినా వారు తిరుమల పవిత్రతను కాపాడేలా ఉండాలని ఆయన సూచించారు. తిరుమలకు వచ్చే ఏ వీఐపీ అయినా ఉద్యమకారులను చెర్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, వీహెచ్ చేసిన వ్యాఖ్యల వల్లే ఉద్యమకారులు ఆవేశానికి గురయ్యారని ఎస్పీ చెప్పారు. జడ్ ప్లస్ కేటగిరీ కన్నా ఎక్కువ భద్రతను వీహెచ్‌కు కల్పించామని, అలిపిరి ఘటనలో ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. దాడులకు పాల్పడినవారిని కూడా గుర్తించామని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. అదే సమయంలో హైదరాబాద్లో సీమాంధ్రుల విషయమై వీహెచ్ చేసిన వ్యాఖ్యలను కూడా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.