జిల్లా ఎల్లలు దాటుతున్న ఇసుక | District demarcate crossing the sand | Sakshi
Sakshi News home page

జిల్లా ఎల్లలు దాటుతున్న ఇసుక

Nov 5 2014 12:10 AM | Updated on Sep 2 2017 3:51 PM

జిల్లా ఎల్లలు దాటుతున్న ఇసుక

జిల్లా ఎల్లలు దాటుతున్న ఇసుక

నగర పరిధిలో, ధవలేశ్వరంలో ప్రస్తుతం నాలుగురేవుల్లో ‘సామాన్యుల ఇసుక అక్కరను తీర్చేందుకు’ జరుగుతున్న తవ్వకాలతో దండిగా సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులకు

 సాక్షి, రాజమండ్రి :నగర పరిధిలో, ధవలేశ్వరంలో ప్రస్తుతం నాలుగురేవుల్లో ‘సామాన్యుల ఇసుక అక్కరను తీర్చేందుకు’ జరుగుతున్న తవ్వకాలతో దండిగా సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులకు జిల్లాలో 27 రీచ్‌లకు పర్యావరణ అనుమతులు దక్కడం చేదుకబురుగా మారింది. ఆ రీచ్‌లలో తవ్వకాలు మొదలైతే ఇసుక ధర దిగి రావచ్చు. అప్పుడు ఇప్పటిలా భారీ లాభాలకు అవకాశం ఉండదు. దీంతో అక్రమార్కులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు ఈలోగానే వీలైనంత ఎక్కువ సొమ్ము రాబట్టుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే రాజమండ్రిలో కుమారి టాకీస్ సమీపంలోని రెండు రేవులు, జీవకారుణ్య సంఘం ఎదురుగా ఉన్న రేవు, ధవళేశ్వరం వద్ద ఉన్న గాయత్రీ రేవుల్లో రెండు రోజులుగా ఇసుక తవ్వకాలు రెట్టింపయ్యాయి. ఈ నాలుగు రేవుల నుంచి ఇసుక నిబంధనలకు విరుద్ధంగా జిల్లా దాటి పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాలకు తరలిపోతోంది. అంతే కాక ముందుగా ఇసుకను నగర శివారు ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి రాత్రిళ్లు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు పది చక్రాల లారీలపై తరలిస్తున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం ఇసుకను లారీల్లో తరలించకూడదు. కానీ అధికారులు కళ్లు మూసుకున్నటు నటిస్తుండగా, ప్రజా ప్రతినిధుల సాక్షిగా ఇసుక జిల్లా ఎల్లలు దాటుతోంది. అధికారులు కళ్లకు కట్టుకున్న గంతలు విప్పడంలేదు.
 
 ‘పశ్చిమ’ లారీలు ఇక్కడికే..
 పశ్చిమగోదావరి జిల్లా గోంగూరతిప్పలో ఉన్న రెండు రేవుల్లో ఒకచోట ఇసుక తవ్వకాలు బోటు నిర్వాహకులు, కూలీల నిరసన వల్ల సోమవారం నుంచి నిలిచి పోయాయి. అక్కడ ఇప్పటికే ఇసుకకు డీడీలు తీసిన వారు 11 వేలకు పైగా ఉండడంతో అక్కడి లారీలు కూడా రాజమండ్రి వచ్చేస్తున్నాయి. సోమ, మంగళవారాలు రాజమండ్రి రేవుల  వద్ద ఇతర జిల్లాల వాహనాలు బారులు తీరి కనిపించాయి. ముందుగా డీడీలు ఇచ్చామన్న వంకతో ధవళేశ్వరం గాయత్రి రేవు నుంచి రాత్రిళ్లు భారీగా ఇసుక ఇతర జిల్లాలకు తరలిపోతోంది. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇసుక తవ్వకం, రవాణా నిలిపివేయాలి. కానీ ఆరు లోపే డీడీలు కట్టలుగా తెచ్చి డ్వాక్రా మహిళలకు ఇచ్చేసి రవాణా రాత్రంతా కొనసాగిస్తున్నారు. దీనిపై కొందరు నిలదీయగా స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధి వారించినట్టు తెలుస్తోంది. స్థానికంగా ఉండే బినామీలు వివిధ పేర్లతో డీడీలు తీయించి వాటిని ప్రాధాన్యక్రమంలో లోడు చేయించినందుకు ఇతర జిల్లాల దళారుల నుంచి లారీకి ఇంత అని అదనపు ఫీజు కూడా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  
 
 ఏ బోట్లకున్నాయి అనుమతులు..?
 ఇసుక తవ్వకాల్లో నిబంధనలు గోదావరి నీళ్లలో కలిసిపోతున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. రీచ్‌లలో కొత్తగా స్థానం సంపాదించిన బోటు సంఘాలకు బోట్లే లేవని తెలుస్తోంది. పశ్చిమగోదావరి నుంచి బోట్లు అద్దెకు తీసుకుని వాటితో పని నడిపిస్తున్నారు. వాటికి లెసైన్సులు లేకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ఒక రెవెన్యూ అధికారి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ‘అసలు ఏ బోట్లకు ఉన్నాయి అనుమతులు?’ అని ఎదురు ప్రశ్నించడం ఇసుక  అడ్డగోలు దందాకు ఒక సాక్ష్యం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement