నెల్లూరు జిల్లా పీకేపాడు ఇసుక అక్రమ రీచ్ వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలు
పీకేపాడు రీచ్ నుంచి వందల లారీల్లో ఇసుక రవాణా
ఓవర్ లోడుతో రహదారి ధ్వంసం
రోడ్డు దుస్థితితో నిలిచిపోయిన ఆర్టీసీ సర్విసులు
రీచ్ వద్ద ధర్నాకు దిగిన టీడీపీ నేతలు
బడా నేతల ఫోన్‌తో వెనుదిరిగిన వైనం
సోమశిల: బడా టీడీపీ నేతలు సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాతో తమ రోడ్డు ధ్వంసమవుతుందంటూ ఆ పార్టీ శ్రేణులే తిరగబడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని పడమటి కంభంపాడు పెన్నానది రీచ్ వద్ద సోమవారం జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించిన ఆ పార్టీ బడా నేతలు కొందరు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అండతో ఎక్కడికక్కడ అనధికారికంగా రీచ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. పెన్నానదిలో మండల పరిధిలోని పడమటి కంభంపాడు రీచ్ ద్వారా నిత్యం వందల టర్బో లారీలు, టిప్పర్లతో ఇసుకను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్నారు.
వాహనాల్లో సామర్థ్యానికి మించి అధిక లోడ్లతో రవాణా చేస్తున్నందున సోమశిల–ఉప్పలపాడు వరకు సుమారు 8 కిలోమీటర్ల ప్రధాన రహదారి అడుగడుగునా భారీ లోతులో గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో సాఫీగా నడిచిపోయే పరిస్థితి లేదు. దీంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు ఇసుక అక్రమ రవాణాదారులకు చెబితే.. పూడుస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన మోంథా, దిత్వా తుఫాన్లతో కురిసిన భారీ వర్షాలకు రహదారి అంతా చెరువును తలపించింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు సైతం సోమశిలకు వెళ్లకుండా ఉప్పలపాడు వద్ద నుంచి మళ్లించుకుని వెళ్లిపోతున్నాయి. పర్యాటక కేంద్రం సోమశిలకు ప్రయాణికుల రాకపోకలు స్తంభిస్తున్నాయి.
ఈ అనధికార రీచ్ మంత్రి ఆనం ఇలాకాలో జరుగుతున్న కారణంగా ధైర్యం చేసి ప్రశ్నించేవారు లేకుండా పోయింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు భారీగా తరలివచ్చి రీచ్ వద్ద ధర్నాకు దిగారు. దెబ్బతిన్న రహదారి గుంతలను పూడ్చండి, లేదంటే రవాణా నిలిపివేయండని నిర్వాహకులను టీడీపీ మండల ఉపాధ్యక్షుడు ఉప్పల విజయకుమార్ హెచ్చరించారు. ఇసుక వాహనాలను కదలనీయకుండా అడ్డుకున్నారు. ఇసుక తవ్వే జేసీబీలను నిలువరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొద్ది సేపటికే పార్టీ ముఖ్య నేతల నుంచి ఒత్తిడి రావడంతో మారు మాట్లాడకుండా ఆందోళనకారులు మౌనంగా వెనుదిరిగారు.


