అక్రమ కట్టడాలపై కొరడా

CRDA Demolish Illegal Constructions On The Krishna River Bank - Sakshi

కృష్ణా నదిలో పాతూరి కోటేశ్వరరావుకు చెందిన చప్టాను ధ్వంసం చేసిన సీఆర్‌డీఏ

దాన్ని చంద్రబాబు నివాసంగా భావించి ఎల్లో మీడియా గగ్గోలు

కొద్దిసేపటికి అదికాదని గ్రహించి గప్‌చుప్‌

మిగిలిన వాటినీ కూల్చేందుకు ప్రణాళిక : సీఆర్‌డీఏ

సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో/తాడేపల్లి రూరల్‌ : గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట వెంబడి కృష్ణానదిలో నిర్మించిన అక్రమ కట్టడాలపై సీఆర్‌డీఏ కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలకు ఇదివరకే నోటీసులు జారీచేసిన అధికారులు... వాటిపై యజమానులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సోమవారం నుంచి ఒక్కో అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ముందుగా పాతూరి కోటేశ్వరరావు నిర్మించిన కాంక్రీట్‌ చప్టాను  సీఆర్‌డీఏ ఏడీ నరేంద్రనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ధ్వంసంచేసి నదీ ప్రవాహం సాఫీగా వెళ్లేలా చేశారు. కానీ, దీనిపై ఎల్లో మీడియా రాద్ధాంతం మొదలుపెట్టి చంద్రబాబు నివాసాన్ని కూల్చివేస్తున్నట్లు గగ్గోలు పెట్టింది. సామాజిక మాధ్యమాల్లోనూ టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్లు దీనిపై హంగామా చేశారు. కొద్దిసేపటికి తొలగించేది చంద్రబాబు నివాసం కాదని తేలడంతో ఎల్లో మీడియా గప్‌చుప్‌ అయింది.

‘లింగమనేని’కి తుది నోటీసులు
వాస్తవానికి చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్‌ అతిథి గృహానికి మూడు రోజుల క్రితం సీఆర్‌డీఏ అధికారులు తుది నోటీసులు జారీచేశారు. అక్రమంగా నిర్మించిన ఆ భవనాన్ని వారం రోజుల్లో తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే,  రెండు నెలల క్రితం కృష్ణా నది కరకట్ట లోపల నిర్మించిన 24 అక్రమ కట్టడాలకు సీఆర్‌డీఏ ప్రాథమిక నోటీసులు జారీచేసింది. ఆ కట్టడాల యజమానుల నుంచి వచ్చిన వివరణలు, ఇతర అంశాలన్నింటినీ పూర్తిగా పరిశీలించిన తర్వాత అందులో ఐదు నిర్మాణాలు నదీ పరిరక్షణ చట్టం ప్రకారం ఏమాత్రం సహేతుకంగా లేవని నిర్ధారించారు. అందులో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని అతిథిగృహంతోపాటు ఆక్వా డెవిల్స్, పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. మిగిలిన 19 నిర్మాణాలకు సంబంధించి ఐదుగురు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. మిగిలిన నిర్మాణాల నుంచి వచ్చిన వివరణలను పరిశీలించి వాటిపైనా నిర్ణయం తీసుకోనున్నారు.

కాగా, సోమవారం తొలగించిన పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణానికి అధీకృత అథారిటీ నుంచి ఎటువంటి అనుమతిలేదని, 1884 నదీ పరిరక్షణ చట్టానికి వ్యతిరేకంగా దీన్ని నిర్మించినట్లు సీఆర్‌డీఏ తెలిపింది. తమ భూమి కోతకు గురికాకుండా ఈ నిర్మాణం చేపట్టినట్లు యజమాని కోటేశ్వరరావు ఇచ్చిన వివరణలో ఎటువంటి సహేతుకత లేకపోవడంతో దాన్ని తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. మరోవైపు.. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటన్నింటిని కూల్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సీఆర్‌డీఏ ఏడీ నరేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. మరోచోట ఎటువంటి అనుమతులు లేకుండా పంట పొలం మధ్యలో చేపట్టిన ఓ నిర్మాణానికి సీఆర్‌డీఏ నోటీసులు జారీచేయడంతో దాని యజమానులే స్వచ్ఛందంగా తొలగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top