
చంద్రబాబు అబద్ధాలకోరు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని ప్రాంత ప్రజలకు చేసిన ఏఒక్క వాగ్దానమూ అమలు కాలేదని సీపీఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్ సీహెచ్.బాబూరావు విమర్శించారు...
- సీపీఎం రాజధాని ప్రాంత కమిటీ కన్వినర్ సీహెచ్ బాబూరావు
తుళ్లూరు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని ప్రాంత ప్రజలకు చేసిన ఏఒక్క వాగ్దానమూ అమలు కాలేదని సీపీఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్ సీహెచ్. బాబూరావు విమర్శించారు. చంద్రబాబును అబద్ధాలకోరుగా ఆయన పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చలో తుళ్ళూరు కార్యక్రమంలో భాగంగా సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ పేదలకు పింఛన్ ఇవ్వలేని చంద్రబాబు ఏవిధంగా రాజధానిని నిర్మిస్తారని ప్రశ్నించారు. భూములు లేని పేదలు 28వేలమంది ఉంటే 16వేలకి కుదించారన్నారు.
వారిలో11 వేల మందికే పింఛన్లు సిద్ధం చేశారన్నారు. అదీ ఇంతవరకు పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదని, పేదలు పస్తులతో అవస్థలు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. ఉచిత విద్య, వైద్య సౌకర్యం ఊసేలేదన్నారు. అసైన్డ్ సాగుదారులకు కౌలు చెక్కులు ఇవ్వకుండా చంద్రబాబు వివక్ష చూపుతున్నారని ఆక్షేపణ తెలిపారు. రైతుల వాటాగా ఇవ్వవలసిన భూమిని ఎక్కడ, ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదన్నారు.దీంతో రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు.రాజధాని కమిటీ ఏర్పాటును తప్పు బట్టారు. సీపీఎం అమరావతి రాజధాని డివిజన్ కమిటీ కార్యదర్శి ఎం. రవి మాట్లాడుతూ పేదలకు న్యాయం చేయలేని స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్ రాజీనామా చేసి ప్రజల తరఫున పోరాడాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కమిటీ నాయకులు జొన్నకూటి నవీన్ ప్రకాష్, గడ్డం కృష్ణ, కాపు రమేష్, కట్టెపోగు ప్రకాశరావు పాల్గొన్నారు.