మోసపోయాం!

మోసపోయాం! - Sakshi


సాధికార సంస్థ ఏర్పాటైనా పైసా మాఫీ కాని తీరు

ఇన్నాళ్లూ ఎదురుచూసి మోసపోయామని వాపోతున్న రైతులు


 

 హైదరాబాద్: రైతు సాధికార సంస్థ ఏర్పాటుతో రైతులంతా రుణ విముక్తులవుతారని, రైతాంగం సమస్యలన్నిటికీ అదే పరిష్కారమని ఊరిస్తూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చివరకు దాన్ని ఏర్పాటు చేస్తూ రూ.5వేల కోట్లు మాత్రమే కేటాయించటంతో రాష్ట్ర రైతాంగం ఆశలు ఆవిరయ్యాయి. ఈ కేటాయింపులతో ప్రస్తుతం ఒక్క పైసా రుణం కూడా మాఫీ అయ్యే అవకాశం లేకపోవటంతో పాటు ఇప్పటికే చెల్లించాల్సిన వడ్డీ చెల్లించకపోవటంతో అది మరో ఏడెనిమిది నెలల్లో రెట్టింపు కాబోతోంది. ఇవన్నీ తలచుకుంటే రైతు గుండె గుభేలుమంటోంది. మంగళవారంనాడు విజయవాడలో రైతు సాధికార సంస్థ ఏర్పాటైనట్టు ప్రకటించిన సీఎం చంద్రబాబు.. రుణాల మాఫీ సంగతి ప్రస్తావించనే లేదు. రైతాంగం... ఆందోళనల దిశగా కదులుతోంది.



 తొలినుంచీ ఆంక్షలు, కుంటిసాకులే..



 రుణ మాఫీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తొలినుంచీ కుంటి సాకులే చెబుతోంది. కమిటీల పేరుతో రకరకాల ఆంక్షలు, పరిమితులు విధిస్తూ కసరత్తు కొనసాగించింది. చివరకు రైతు సాధికార సంస్థను తెరపైకి తెచ్చింది. రుణాలను సకాలంలో చెల్లించని కారణంగా దాదాపు ఈ ఏడాది జూన్ నాటికే రూ.14 వేల కోట్ల వడ్డీ భారం పడినప్పటికీ.. మొత్తంగా రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో రైతులు ఐదు నెలలుగా ఎదురుచూశారు. అక్టోబర్ 21న రైతు సాధికార సంస్థ ఏర్పాటు చేస్తామని, ఆలోగా రైతుల ఖాతాల వివరాలన్నీ సేకరించి రుణాలన్నింటినీ మాఫీ చేస్తామంటూ ఇటీవల కొంతకాలంగా ప్రభుత్వం నమ్మబలుకుతూ వచ్చింది. తీరా సాధికార సంస్థ ఏర్పాటైనా ప్రభుత్వం మాట నిలుపుకోకపోవడం, రుణాలు మాఫీ కాకపోవడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోరుుంది. లక్షల్లో చేసిన అప్పులు తీరకపోవడం, ప్రైవేటుగా అప్పులు చేసి వేసిన పంటలను కరువు, తుపాను కబళించడంతో తీవ్ర నిరాశా నిస్ప­ృహలకు గురవుతున్నారు. రుణం, వడ్డీ కలిసి తడిసిమోపెడైన భారాన్ని తలుచుకుని అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.



రూ.5 వేల కోట్లు వడ్డీకే చాలవు..



సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ తర్వాత రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి నివేదించిన వివరాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు, రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలున్నాయి. రుణాలను సకాలంలో తిరిగి బ్యాంకులకు చెల్లించని కారణంగా రైతులపై ఒక్క ఏడాదికే రూ.14 వేల కోట్లకు పైగా అపరాధ వడ్డీ భారం పడింది. ఎన్నికల్లో, ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం ఈ రుణాలన్నిటినీ ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేయూలి. కానీ సుదీర్ఘ కాలయూపన తర్వాత రుణమాఫీ కోసం అంటూ ఏర్పాటు చేసిన సాధికార సంస్థకు కేవలం రూ.5 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకొంది. ఈ రూ.5 వేల కోట్లను బ్యాంకులు వడ్డీ కిందే జమ చేసుకుంటాయని, మెుత్తం వడ్డీయే తీరనప్పుడు, తమ రుణాలన్నీ ఎలా మాఫీ అవుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు.

 బాబుదే బాధ్యత: చంద్రబాబు హామీని నమ్మ డం వల్ల రైతులు అన్ని విధాలా నష్టపోయూరు. ఈ ఖరీఫ్‌లో 11 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెల కొన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 664 మండలాలకు గాను 568 మండలాల్లో వర్షాభావ పరిస్థితు లు ఉన్నట్లు రాష్ట్ర అర్ధగణాంక శాఖ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. రైతులు గత ఏడాది తీసుకున్న రుణాలు చెల్లించి ఈ ఏడాది రెన్యువల్ చేసుకుని ఉంటే ఈ ఖరీఫ్‌లో వేసిన పంటలకు బీమా వర్తించేది. కరువు వల్ల పంటలు ఎండిపోయిన రైతులకు బీమా రూపంలో పరిహారం వచ్చేది. రుణాలు రెన్యువల్ చేయించుకుని ఉం టే హుదూద్ తుపానువల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు కోల్పోయిన రైతులకు కూడా ఇప్పుడు పంటల బీమా వచ్చేది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తర్వుల ప్రకారం లక్షలోపు రుణాలకు వడ్డీ కూడా వర్తించేది. కానీ రుణమాఫీపై ఇచ్చిన హామీని చంద్రబాబు అమలు చేయకుండా కసరత్తు పేరిట కాలయూపన చేయడంవల్ల రైతులు అన్నివిధాలా తీవ్రంగా నష్టపోయారు. అసలే అప్పుల్లో ఉన్న వారికి అధిక వడ్డీ పెను భారంగా మారింది. పంటల బీమా ఆశ లేకుండా పోయింది. ఇందుకు పూర్తిగా చంద్రబాబే బాధ్యులంటూ రైతులు మండిపడుతున్నారు.

 

5 నుంచి ఉద్యమమే: వైఎస్ జగన్




 మాఫీ విషయంలో బాబు సర్కారు నాన్చు డు ధోరణిని ఎండగడుతూ నవంబర్ 5 నుంచి రైతుల తరఫున ఉద్య మం చేపడుతున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కాకి నాడ పర్యటనలో ప్రకటించారు. ‘‘రుణమాఫీపై జరుగుతున్న అన్యాయాన్ని రైతులు నిశితంగా పరిశీలిస్తున్నారు. బాబు మాట లకు, చేతలకు పొంతన లేదు. ఎన్నికలప్పు డు ఒకమాట, తీరా గెలిచాకా ఒక మాట మాట్లాడుతున్నాడు’’అంటూ ధ్వజమెత్తారు.

 

నగలు వేలం వేస్తామని నోటీసు



మాకు కౌండిన్య నది పక్కన మూడెకరాల పొలం ఉంది. పంటల సాగు కోసం బంగా రం తాకట్టు పెట్టి పలమనేరులోని బ్యాంకులో రూ. 2.5 లక్షలు అప్పు తీసుకున్నాం. బోరు ఎండిపోవడంతో పంట చేతికందలేదు. ప్రభుత్వమే అప్పు తీర్చేస్తుందని  అదే పదివేలని ఆశించాం. ఇప్పుడు బ్యాంకు వాళ్లు అప్పు తీర్చాలని లేని పక్షంలో నగలు వేలం వేస్తామని నోటీసులు పంపారు. చంద్రబాబును నమ్మి ఆశపడినందుకు నగలమీద ఆశ వదలాల్సి వచ్చేలా ఉంది. ఇద్దరు ఆడబిడ్డలున్న మేం నగలు కూడా లేకపోతే ఏమి చేయాలో తెలియక కుమిలిపోతున్నాం.

 - మునిరత్నమ్మ, కొంగోళ్లపల్లె,

 గంగవరం మండలం, చిత్తూరు జిల్లా

 

రైతు సాధికార సంస్థ ఓ నాటకం



ఎవరూ రుణాలు చెల్లించవద్దని, అధికారంలోకి రాగానే మొత్తం రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు బ్యాంకులకు డబ్బు చెల్లించకుండా మాకు నోటీసులు వచ్చేలా చేస్తున్నారు. ఇప్పుడు రైతు సాధికార సంస్థ అని మరో నాటకం మొదలుపెట్టారు. ఖరీఫ్ పూర్తయి రబీ వచ్చినా రుణాలు రెన్యువల్ చేసుకోనందున మాకు కొత్త రుణాలు రాలేదు.బ్యాంకులకు డబ్బు చెల్లించి రుణ విముక్తులను చేయకుండా ఇప్పుడు రైతులకు బాండ్లు జారీ చేస్తామంటూ మభ్యపెడుతున్నారు.

 - టి. లక్ష్మీ కోటేశ్వరరావు, గుంటూరు జిల్లా

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top